కై లాస్‌నగర్: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ(ఎస్‌ఐఆర్)లో భాగంగా జిల్లావ్యాప్తంగా గురువారం గ్రామ, వార్డుసభలు నిర్వహించనున్నారు. ఇటీవల ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించిన నేపథ్యంలో వీటిని పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతుంది. సభల నిర్వహణపై ఇప్పటికే మండల, వార్డుస్థాయి అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. పారదర్శక ఓటర్ల జాబితా తయారీలో కీలకమైన ఈ సభల నిర్వహణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కొత్త ఓటర్ల నమోదుపై అవగాహన
ముసాయిదా జాబితా వివరాలు వెల్లడించడంతో పాటు కొత్త ఓటర్ల నమోదుపై కూడా ఈ సభల్లో అవగాహన కల్పించనున్నారు. ముఖ్యంగా 2026 అక్టోబర్ 1నాటికి 18ఏళ్ల నిండిన యువత ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకునేలా చర్యలు చేపడుతారు. వీరంతా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేలా ఫారం–6లను అందించనున్నారు. చిరునామాలో మార్పులు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లడం వంటి సవరణలు అవసరమైన పక్షంలో ఫారం–8 ద్వారా, జాబితాలో పేరు తొలగింపు, ఇతర ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫారం –7ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. వాటిని పూరించిన తర్వా త తగు ఆధారాలతో తిరిగి స్వీకరిస్తారు. అలాగే గతంలో ఓటు హక్కు కలిగి ఉండి, వినియోగించుకున్నప్పటికీ ముసాయిదాలో పేర్లు లేనటువంటి ఓటర్లు తాము ఆయా ప్రాంతాల్లోని ఓటర్లమేనని నిర్ధారించుకునేలా ఈసీ నిర్దేశించిన 12 ధ్రువీకరణ పత్రాల్లో ఏదైనా ఒకదానిని సమర్పించేలా వారికి అవగాహన కల్పించనున్నారు.
విజయవంతం చేయాలి
ఎన్నికల సంఘం ఆదేశానుసారం ఈనెల 27న జిల్లావ్యాప్తంగా వార్డు, గ్రామసభలు నిర్వహిస్తున్నాం. ముసాయిదా జాబితాలోని ఓటర్లతో పాటు ఏఎస్‌డీ జాబితాలోని ఓటర్ల వివరాలను ఇందులో అధికారులు చదివి వినిపిస్తారు. జాబితాలో పేర్లు లేని ఓటర్ల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు చేపట్టిన ఈ సభలను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.
– ఎస్.రాజేశ్వర్, అదనపు కలెక్టర్


