సాక్షి, ఆదిలాబాద్: ఎల్‌నినో ప్రభావం కారణంగా పత్తి, సోయా కాకుండా ఆరు తడి పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించినప్పటికీ జిల్లా రైతులు అనవాయితీనే కొనసాగించారు. పత్తి గతేడాది మించి సాగు కాగా, కంది కూడా కొంత పెరిగింది. సోయా, మొక్కజొన్న మాత్రం తగ్గింది. మరోవైపు జిల్లాలో సాగు విస్తీర్ణం వందశాతానికి చేరువైంది.
తెల్లబంగారంపై తగ్గని మురిపెం
తెల్ల బంగారాన్ని మురిపెంగా భావించే జిల్లా రైతులు వాతావరణ పరిస్థితుల్లో ఎలాంటి ఒడిదొడుకులు ఉన్నా తమ సాగును మాత్రం మార్చేది లేదనేది స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా పత్తి, సోయా పంటల విస్తీర్ణాన్ని తగ్గించుకోవాలని ప్రభుత్వం, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ సీజన్ మొదటి నుంచి చెబుతూ వచ్చారు. రైతులు మాత్రం పత్తి వైపే మొగ్గు చూపారు. కంది కూడా కొంత మేర పెరిగింది.
ఇది సాధారణ అంచనా మాత్రమే..
వానాకాలంలో సాగయ్యే సాధారణ సాగు విస్తీర్ణం అంచనాను వ్యవసాయ శాఖ ముందుగా ప్రకటిస్తుంది. గతేడాదిలో సాగైన పంటల లెక్కల ప్రకారం అంచనా వేస్తుంది. డిజిటల్ క్రాప్ సర్వే తర్వాత కచ్చితమైన వివరాలు వచ్చే అవకాశం ఉంటుంది.
బయటపడినట్లేనా ..
ఈ వానాకాలంలో 30శాతం మేర లోటు వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ ప్రకటించడంతో, వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు పంటల సాగు విషయంలో రైతులకు పలు సూచనలు, సలహాలు జారీ చేశారు. సంప్రదాయ పంటలు కాకుండా ఆరుతడి వైపు దృష్టి సారించాలని సూచించారు. వర్షాకాలం సీజన్ మొదలైన తర్వాత మృగశిర కార్తె ప్రవేశంతో జిల్లా రైతులు 20 నుంచి 30 శాతం వర కు విత్తనాలు నాటారు. మొదటి మూడు వారాలు సరైన వర్షాలు లేకపోవడంతో పలువురు రైతులకు విత్తన నష్టం చేకూరింది. మళ్లీ వర్షాభావం ఉన్నప్పటికీ రెండో సారి కూడా పలువురు విత్తనాలు విత్తారు. జూన్ చివరలో మంచి వర్షం కురువడంతో ఊపిరి పీల్చుకున్నారు. జూలై మొదట్లోనూ వర్షాలు పర్వలేదనిపించాయి. ఈ క్రమలో సాగు విస్తీర్ణం సాధారణ అంచనాకు చేరుకుంది. ఆ తర్వాత వరుణుడి జాడ కానరాక మొలకెత్తిన మొక్కలు వాడిపోయే పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ తరుణంలో జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. పంటలు నిలిచాయి. ప్రస్తుతం జిల్లా అంతటా పత్తి, సోయా ఇతర పంటల మొలకలు చేలల్లో కనిపిస్తున్నాయి. రైతులు సాగు బీజీలో ఉన్నారు.
ముందు ఎలా ఉంటుందో ..
జిల్లాలో ప్రస్తుతం సాధారణ వర్షపాతం నమోదు కావడంతో సాగుపరంగా పరిస్థితులన్నీ అనువుగా ఉన్నాయి.సాత్నాల పూర్తిస్థాయిలో నిండకపోయినా మరో మధ్యతరహా ప్రాజెక్ట్ మత్తడివాగు నిండుకుండలా మారింది. చెరువులుకూడా 75శాతంపైగా నిండాయి. భూగర్భజలాలు పర్వలేదనిపిస్తున్నాయి. ఇ ప్పటికై తే పరిస్థితులన్నీ రైతుకు అనువుగా ఉన్నా యి. ఎల్‌నినో నేపథ్యంలో మళ్లీ ఆ ప్రభావం ఉంటుందా అనే ఆందోళన కూడా లేకపోలేదు.


