నార్నూర్: అడవితో మమేకమై జీవించే గిరిజనులు తరతరాలుగా వెదురుతో ఎన్నో రకాల వస్తువులను తయారు చేస్తూ తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటున్నారు. ఒకప్పుడు ఇంటి అవసరాలకే పరిమితమైన ఈ కళకు ఆధునిక రూపునిస్తూ.. మార్కెటింగ్ అవకాశాలను కల్పిస్తే గిరిజనులకు మంచి ఆదాయవనరుగా మారుతుందనే ఉద్దేశంతో నడ్డంగూడలో ‘కుమురం సూరు’ వెదురు ఉత్పత్తుల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
నీతి ఆయోగ్ పథకంలో భాగంగా..
నార్నూర్ మండలంలోని నడ్డంగూడలో నీతి ఆయో గ్ పథకంలో భాగంగా ‘కుమురం సూరు’ వెదురు ఉత్పత్తుల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 2026 ఏప్రిల్ 21న కలెక్టర్ రాజర్షి షా కేంద్రాన్ని ప్రారంభించారు. స్కిల్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో 40 మంది గిరిజనులు వెదురు ఉత్పత్తుల తయారీలో శిక్షణ పొందుతున్నారు. సంప్రదాయ నైపుణ్యానికి ఆధునిక డిజైన్‌ను జోడిస్తూ కొత్త ఉత్పత్తుల తయారీపై అవగాహన కల్పిస్తున్నారు.
బొంగుతో బోలెడు కళాఖండాలు
ఆదివాసీ జీవనంలో వెదురుకు ప్రత్యేక స్థానం ఉంది. పండుగలు, వివాహాలు, వ్యవసాయ పనులు, గృహ అవసరాల్లో వెదురుతో చేసిన వస్తువులు విస్తృతంగా వినియోగిస్తారు. వెదురు బొంగులతో కేవలం బుట్టలు, చాపలే కాకుండా ఆధునిక అవసరాలకు అనుగుణంగా సెల్‌ఫోన్ స్టాండ్లు, బ్యాంగిల్ స్టాండ్లు, పెన్ స్టాండ్లు, గృహాల నమూనాలు, ఎడ్లబండ్లు, నాగళ్లు, వివిధ రకాల పక్షుల ఆకృతులు, తదితర కళాఖండాలు తయారు చేస్తున్నారు. తరతరాలుగా వస్తున్న ఈ కళను నేటి మార్కెట్ అవసరా లకు అనుగుణంగా తీర్చిదిద్దితే యువతకు ఉపాధి లభించడంతోపాటు కనుమరుగవుతున్న సంప్రదా య కళకు పునరుజ్జీవం లభిస్తుంది. మార్కెట్ సౌకర్యం కల్పిస్తే గిరిజనులకు ఆదాయం పెరగడంతో పాటు జీవన ప్రమాణాలు మెరుగుపడనున్నాయి.
ఆదివాసీ కళకు కొత్త చిరునామా..
అడవుల్లో సహజంగా లభించే వెదురును ముడి పదార్థంగా వినియోగించి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయడం ద్వారా గిరిజనుల సంప్రదాయ జ్ఞానానికి వాణిజ్య రూపం లభిస్తోంది. పర్యావరణహితమైన వెదురు ఉత్పత్తులకు ప్రోత్సాహం లభిస్తే ప్లాస్టిక్ వినియోగం తగ్గే అవకాశం ఉంది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేళ గిరిజన ‘కళను కాపాడుతూ.. ఉపాధిని పెంచుతూ.. సంప్రదాయాన్ని నిలబెడుతూ’ ముందుకు సాగుతున్న నడ్డంగూడ ‘కుమురం సూరు’ కేంద్రం ఆదివాసీ స్వావలంబనకు ఓ మంచి ఉదాహరణగా నిలుస్తోంది.


