ఉట్నూర్‌రూరల్: ఆదివాసీలు తమ ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకుంటూ భావితరాలకు అందిస్తున్నారు. ఆదివాసీ పండుగలు, పాటలు, సంగీతం, ఆటలు, భాష యాస కథలు, వస్త్రాధారణలు, ఆభరణాలు నేటికీ సజీవంగా ఉన్నాయి.
తుడుం
గోండులు పెర్సాపేన్ పండుగను దండారీ డప్పుల దరువులతో నిర్వహిస్తుంటారు. కొలాములు పోలకమ్మ పండుగ, భీమయ్యక్ ఉత్సవం (సట్టి దెయ్యాల్), దండారీ, దసరా పండుగల్లో తుడుం మోగిస్తారు. గోండులు జంగుబాయి, పెర్పాపేన్, దండారి ఉత్సవాలల్లో తుడంను డోలుకు సహా వాయుద్యంగా మోగిస్తుంటారు అలాగే డెంసా నృత్యం చేస్తారు.
కిక్రి వాయిద్యం
గోండి సంప్రదాయాలకు, గౌరవానికి ఇది సంకేతం. గోండి పూజారులైన ప్రధాన్లు కర్మకాండలు, వి వాహాలు, చావులు, ఉత్సవాల్లో దీనిని వాయిస్తారు.
డోలు
డోలు లేని ఆదివాసీ ఊరు ఉండదు. డోలు వాయిద్యానికి ప్రత్యేకమైన జానపద నృత్యాలు, గేయాలు ఉంటాయి. ఆదివాసీల దహన సంస్కారాల్లో వాయిస్తారు. ఒక్కో కార్యానికి ఒక్కోతీరు ఉంటుంది.
డోల్‌కి జోరు
డోల్‌కి వాయిద్యం ఆదివాసీ వివాహ వేడుకల్లో రాత్రి వేళల్లో నృత్యం చేయడానికి వినియోగిస్తారు. పురుషులు సీ్త్ర వేషధారణలో నృత్యం చేస్తుంటారు.


