కడెం: మండలంలోని మారుమూల గ్రామమైన మిద్దెచింతకు అనేక ఏళ్లుగా విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో ఆదివాసీ గిరిజనులు అంధకారంలోనే జీవిస్తున్నారు. అయినప్పటికీ ఆయిల్ ఇంజన్‌లతో పంటలను సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఆయిల్ ఇంజిన్లతో సాగు
కడెం మండలం ఉడుంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మిద్దెచింత గ్రామానికి వెళ్లాలంటే ఉడుంపూర్ ప్రధాన రహదారి నుంచి మూడు కిలోమీటర్లు అటవీప్రాంతం గుండా వాగులు, వంకలు దాటుకుంటూ వెళ్లాలి. గ్రామంలో సుమారు 35 కుటుంబాలు నివాసం ఉంటున్నారు. వారంతా వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నారు. భూములకు సాగునీరు అందించేందుకు చెరువులు, కాలువలు లేవు. వ్యవసాయ బావులే ఆధారం. గతంలో రాటు బొక్కెనలతో సాగు నీటిని అందించారు. కొన్నేళ్లుగా ఆయిల్ ఇంజిన్లను ఏర్పాటు చేసుకుని జొన్న, పత్తి, నువ్వులు, కందులు, ఇతర పప్పు దినుసులు పండిస్తున్నారు. అటవీచట్టాల అడ్డంకితో ఈ గ్రామం విద్యుత్ సౌకర్యానికి నోచుకోవడం లేదు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తమ గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని వేడుకుంటున్నారు.


