ఆదిలాబాద్‌టౌన్: రాత్రి వేళల్లో అనవసరంగా రోడ్లపై సంచరించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి హెచ్చరించారు. ఎస్పీ ఆదేశాల మేరకు నేరాల నియంత్రణ, దొంగతనాల నివారణ, ప్రశాంత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా గురువారం అర్ధరాత్రి ఆపరేషన్ చబుత్రాను వన్‌టౌన్, టూటౌన్, మావల, రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించినట్లు తెలిపారు. రాత్రి 12గంటల తర్వాత నిర్వహించిన తనిఖీల్లో రోడ్లపై, ప్రధాన కూడళ్ల వద్ద, హోటళ్ల ముందు, గద్దెలపై అకారణంగా తిరుగుతున్న 134 మంది యువకులను గుర్తించి స్టేషన్లకు తరలించినట్లు పేర్కొన్నారు. వారి కి కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం తల్లిదండ్రులను పిలిపించి అప్పగించినట్లు వివరించారు. అలాగే ధ్రువీకరణ పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడు తూ పట్టణంలో వ్యాపార సముదాయాలు రాత్రి 10.30 గంటలకే మూసివేయాలని, 11 గంటల లోపు ప్రతిఒక్కరూ ఇళ్లకు చేరుకోవాల ని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వా రిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఇందులో పట్టణ సీఐలు సునీల్ కుమార్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు మురళి, చంద్రశేఖర్, ఎస్సైలు నాగనాథ్, అశోక్, ఆర్‌ఎస్సైలు గోపీకృష్ణ, మనీష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


