ఆదిలాబాద్/ఆదిలాబాద్‌టౌన్:తల్లిపాలతోనే బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, నవజాత శిశువు శారీరక, మానసిక వికాసానికి తల్లిపాలు ఎంతో కీలకమని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ప్రపంచ తల్లిపా ల వారోత్సవాల సందర్భంగా బుధవారం రిమ్స్ నుంచి ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో మెడికోలు, తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు నాటికలు, పాటల ద్వారా తల్లిపాల ప్రాధాన్యతను వివరిస్తూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బిడ్డ పుట్టిన మొదటి ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు. తల్లిపాలు సరిగా రాని సందర్భాల్లో ‘కంగారూ మదర్ కేర్’ విధానం ద్వారా సహజంగా పాల ఉత్పత్తి పెరుగుతుందని, రిమ్స్‌లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఐసీఎంఆర్ ’సంకల్ప్’ కార్యక్రమం ద్వారా నవజాత శిశు మరణాల రేటు తగ్గించగలిగామని పేర్కొన్నా రు. అనంతరం తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మెడికోలకు నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతి భ కనబరిచిన వారికి కలెక్టర్ బహుమతులు అందజేశారు. ఇందులో డీఎంహెచ్‌వో సాధన, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, వైద్యులు వెంకట్ రెడ్డి, అశోక్, వైద్యశాఖ అధికారులు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక అవసరాల పిల్లలకు అండగా నిలవాలి
ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు అండగా నిలవాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాల పిల్లల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. భవిత సెంటర్లలో ఏఐ సాంకేతికతతో పాటు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ఫిజియోథెరపిస్టులు, స్పీచ్ థెరపిస్టులను నియమించి పిల్ల లకు అవసరమైన శిక్షణ అందిస్తున్నామని పేర్కొన్నారు. డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రత్యేక అవసరాల పిల్లలను సమాజంలో ఉన్నత స్థాయికి తీసుకురావడం అందరి సామాజిక బాధ్యత అన్నారు. అనంతరం ప్రత్యేక అవసరాల పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న పలువురు తల్లిదండ్రులను సన్మానించారు. కార్యక్రమంలో చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు గంగారాం, డీఈవో మాధవి, డీఎంహెచ్‌వో సాధన, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, రాష్ట్ర రిసోర్స్ పర్సన్ జగదీశ్వర్, జిల్లా కోఆర్డినేటర్ ఉష్కం తిరుపతి, ప్రత్యేక అవసరాల పిల్లలు, వారి తల్లిదండ్రులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


