రామగుండం: మిత్రులతో కలిసి సరదాగా నదిలో చేపలు పడుతూ, స్విమ్మింగ్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో పడి సింగరేణి ఉద్యోగి మృతిచెందిన ఘటన పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం గోలివాడ శివారులో బుధవారం జరిగింది. ఎస్సై వెంకటస్వామి కథనం ప్రకారం.. గోదావరిఖని వకీల్‌పల్లిగనిలో విధులు నిర్వహించే సింగరేణి ఉద్యోగి కూన రాజ్‌కుమార్(32) బుధవారం తన మిత్రులతో కలిసి గోలివాడ శివారులోని గోదావరినది వద్దకు వచ్చాడు. మిత్రులతో కలిసి సరదాగా చేపలు పడుతూ నీటిలో స్విమ్మింగ్ చేస్తున్న క్రమంలో నీటిలో మునిగి కనిపించకుండా పోయాడు. మిత్రులు ఆందోళన చెంది పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై వెంటనే రెస్క్యూ టీంతో గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. రాజ్‌కుమార్ ప్రస్తుతం మంచిర్యాల జిల్లా మందమర్రిలోని గణేశ్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఆయన స్వగ్రామం పెద్దపల్లి జిల్లా నందిమేడారం. మృతుడికి భార్య అఖిల, కుమారుడు హరీశ్ ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.


