ఉట్నూర్‌రూరల్: ప్రజలను బెదిరించడం, రౌడీయిజానికి పాల్పడడం, మోసాలు చేయడం, దాడులు చేయడం వంటి పలు నేరాలకు పాల్పడుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్న ఆదిలాబాద్ పిట్టలవాడకు చెందిన జాదవ్ గోపాల్ అనే నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు చేసి చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించినట్లు ఉట్నూర్ సీఐ మడవి ప్రసాద్ తెలిపారు. బుధవారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడిపై ఇప్పటివరకు బెదిరింపులు, రౌడీయిజం, మోసాలు, దోపిడీలు, దాడులు తదితర నేరాలకు సంబంధించి మొత్తం 16 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ప్రజల భద్రతను పరిరక్షించేందుకు ఎస్పీ అఖిల్ మహాజన్ సిఫార్సు మేరకు కలెక్టర్ రాజర్షి షా నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు వెల్లడించారు. నిందితుడిని చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించినట్లు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే, పునరావృతంగా నేరాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.


