నేరాల నియంత్రణకు కార్డెన్‌ సెర్చ్‌ | - | Sakshi
Sakshi News home page

నేరాల నియంత్రణకు కార్డెన్‌ సెర్చ్‌

Aug 6 2026 2:08 AM | Updated on Aug 6 2026 2:08 AM

● ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

ఆదిలాబాద్‌టౌన్‌: నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల్లో భద్రతా భావం పెంపొందించడమే లక్ష్యంగా కమ్యూనిటీ కాంటాక్ట్‌ కార్యక్రమాలు చేపడుతున్నామని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌నగర్‌లో కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించినట్లు తెలిపారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి సుమారు 150 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో కాలనీలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. 220 ద్విచక్ర వాహనాలు, 29 ఆటోలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. నంబర్‌ ప్లేట్‌ లేని, నకిలీ నంబర్‌ ప్లేట్లతో ఉన్న 6 వాహనాలను గుర్తించి సీజ్‌ చేశారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముగ్గురి నుంచి 46 క్వార్టర్‌ బాటిళ్లు, 28 చిన్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. మట్కా ఆడుతున్న షేక్‌ ఖలీల్‌, రంజిత్‌, దినేష్‌లపై కేసులు నమోదు చేసి వారి మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. గంజాయి, మట్కా, అక్రమ మద్యం, పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను సహించబోమని హెచ్చరించారు. కాలనీ ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆదిలాబాద్‌ డీఎస్పీ ఎల్‌.జీవన్‌రెడ్డి, ఏఆర్‌ డీఎస్పీ కమతం ఇంద్రవర్ధన్‌, వన్‌టౌన్‌ సీఐ సునీల్‌కుమార్‌, సీఐలు రహీం పాషా, కె.నాగరాజు, నైలు, చంద్రశేఖర్‌, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు టి.మురళి, ఎన్‌.చంద్రశేఖర్‌, ఎస్సైలు నాగనాథ్‌, వి.విష్ణువర్ధన్‌, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు

మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ధన్గర్‌ మొహళ్లలో బుధవారం నార్కోటిక్‌ జాగిలం రోమా సహాయంతో తనిఖీలు నిర్వహించగా, 15 గ్రాముల గంజాయి లభ్యమైనట్లు పేర్కొన్నారు. నిందితుడు షేక్‌ వాజిద్‌ ఇంట్లో 4 గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశామని తెలిపారు. సీసీఎస్‌ సిబ్బంది రమేశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement