భైంసా: నిర్మల్ జిల్లా కుంటాల మండలం లింబా –బి గ్రామంలో సంచలనం సృష్టించిన దోతరే బాలాజీ (35) హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మృతుడి భార్య దోతరే పీరాబాయిని అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. భైంసా ఏఎస్పీ సాయికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. బాలాజీ మద్యానికి బానిసై తరచూ భార్యను వేధించేవాడు. ఆగస్టు 3న మద్యం మత్తులో తన తాత పీరాజీతో గొడవపడి దాడి చేసి ఇంటికి వెళ్లాడు. అనంతరం ఇంట్లో భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈక్రమంలో మద్యం మత్తులో ఉన్న భర్త గొంతును అతని చొక్కాతో బిగించి ఊపిరాడకుండా చేసి పీరాబాయి హత్య చేసింది. హత్య అనంతరం బాలాజీ మద్యం మత్తులో గ్యాస్ సిలిండర్‌పై పడి గాయాలతో మృతి చెందినట్లు నమ్మించే ప్రయత్నం చేసింది. ఘటనకు సంబంధించిన ఆనవాళ్లను తొలగించి, సహజ మరణంగా చిత్రీకరించి అంత్యక్రియలకు సిద్ధం చేసింది. కానీ మృతుడి బంధువులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి శాసీ్త్రయ ఆధారాలతో విచారణ చేపట్టిన పోలీసులు నిందితురాలి ప్రమేయాన్ని నిర్ధారించి అరెస్టు చేశారు. సమావేశంలో భైంసారూరల్ సీఐ ప్రవీణ్ ఉన్నారు.


