ఆదిలాబాద్‌టౌన్: గిరిజనులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యసేవలు అందించాలని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. మంగళవారం రిమ్స్‌ను సందర్శించి గిరిజనులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వార్డుల్లో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడారు. వైద్యసేవల్లో ఎలాంటి లోపాలు లేకుండా ప్రతి రోగికి సకాలంలో చికిత్స అందించాలని సూచించారు. ఆసుపత్రిలో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సౌకర్యం, మందుల లభ్యత, వైద్య సిబ్బంది హాజరు తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో విశ్వాసం పెరిగేలా బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. పీవో వెంట రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్, అదనపు డీఎంహెచ్‌వో మనోహర్, రిమ్స్ వైద్యులు ఉన్నారు.


