ఖానాపూర్: పట్టణంలోని శివాజీనగర్ కాలనీకి చెందిన రంజిత్ కుమారుడు రుద్రాన్ష్ (2)పై వీధికుక్క దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఖానాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికి త్స అందించారు. కాలనీలో వీధికుక్కల బెడద పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఉట్నూర్‌లో ఒకరిపై..
ఉట్నూర్‌రూరల్: మండల కేంద్రానికి చెందిన లియాకథ్‌పై మంగళవారం పిచ్చికుక్కలు దాడి చేయడంతో గాయాలయ్యాయి. పట్టణంలోని చికెన్ సెంటర్ల నిర్వాహకులు కోళ్ల వ్యర్థాలను రోడ్డుపక్కన పడేయడంతో కుక్కలు సమూహాలుగా చేరి ఒకదానిపై ఒకటి దాడి చేసుకోవడంతో పాటు, ఆ దారిన వెళ్లే బాటసారులు, వాహనదారులు, చిన్నారులపై దాడులు చేసి గాయపరుస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు.
కొలాంగూడలో యువకుడిపై..
లింగాపూర్: మండలంలోని జాముల్‌ధర గ్రామ పంచాయతీలోని కొలాంగూడకు చెందిన భీంరావ్‌పై కుక్క దాడి చేయడంతో గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన భీంరావ్ మంగళవారం ఏల్లాపటార్ గ్రామ సమీపంలో పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా కుక్క దాడికి పాల్పడింది. గాయాలు కావడంతో లింగాపూర్ ఆస్పత్రికి, అక్కడి నుంచి ఉట్నూర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్లు బాధితుడి తండ్రి తెలిపారు.


