నకిలీ దందా C/0 ఇచ్చోడ! | - | Sakshi
Sakshi News home page

నకిలీ దందా C/0 ఇచ్చోడ!

Aug 5 2026 1:41 AM | Updated on Aug 5 2026 1:41 AM

2020లో కల్యాణలక్ష్మితో ప్రారంభం.. 2024లో నకిలీ నివాస ధ్రువీకరణ పత్రాలు పొంచి ఉన్న ప్రమాదం

ఇచ్చోడ: నకిలీ ధ్రువీకరణ పత్రాల పర్వం ఆది లా బాద్‌ జిల్లాలో కొనసాగుతూనే ఉంది. జిల్లా వ్యాప్తంగా ప్రతీరోజు ఏదో ఒకచోట సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొంతకాలంగా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా నకిలీల జోరు మాత్రం తగ్గడంలేదు. ఇచ్చోడ మండలంలో పంచాయతీ కార్యదర్శి పేరుతో నకిలీ రబ్బర్‌ స్టాంప్‌ తయారు చేసి అతని సంతకాన్ని ఫోర్జరీ చేసి వివిధ రకాల పత్రాలు సృష్టించిన ముఠాను పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కొంతమంది వ్యక్తుల ప్రమేయంతోనే దందా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

2020లో ప్రారంభం..

ఇచ్చోడ కేంద్రంగా మొదటిసారిగా 2020లో తప్పుడు పత్రాలు సృష్టించి ఆధార్‌కార్డులో వయస్సును మార్పింగ్‌ చేసి కల్యాణలక్ష్మి పథకం కింద డబ్బులు డ్రా చేసుకున్న సంఘటన అప్పట్లో రాష్ట్రంలోనే సంచలనం కలిగించింది. అప్పటి బీజం నేటికీ కొనసాగుతూనే ఉంది. రెండేళ్ల క్రితం ఇచ్చోడ మండల కేంద్రంలో ఆధార్‌ కార్డులో ఫొటో, పుట్టినతేదీ మార్పింగ్‌ చేస్తున్న కొంతమందిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలిచారు.

అప్రమత్తంతో ఆగిన తంతు..

ఇచ్చోడ మండలంలోని ఇస్లాంనగర్‌లో నివాసముంటున్నట్లు నకిలీ ధ్రువీకరణ పత్రాలతో ముగ్గురు ఉద్యోగాలు పొందడంతో 2024 జూలై నుంచి 2025 ఫిబ్రవరి వరకు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 189 మంది నివాస ధ్రువీకరణ పత్రాలకోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో అప్రమత్తమైన రెవె న్యూ అధికారులు దరఖాస్తులన్నింటినీ తిరస్కరించడంతో నకిలీల తంతు అక్కడితోనే ఆగిపోయింది.

పొంచి ఉన్న ప్రమాదం

ఇచ్చోడ కేంద్రంగా కొన్నేళ్లుగా కొనసాగుతున్న నకిలీ ధ్రువీకరణ పత్రాలతో భవిష్యత్‌లో ప్రమాదం పొంచి ఉందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు.

కఠినచర్యలు తీసుకుంటాం

నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. నకిలీ పత్రాలు సృష్టించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. జిల్లా వ్యాప్తంగా పలు కేసులు నమోదు చేశాం.

– అఖిల్‌ మహాజన్‌, ఎస్పీ, ఆదిలాబాద్‌

2024లో తప్పుడు పత్రాలతో ఉద్యోగాలు..

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన కొంతమంది నిరుద్యోగ యువకులు ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలంలోని ఇస్లాంనగర్‌లో నివాసం ఉంటున్నట్లు నివాస ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ముగ్గురు బీఎస్‌ఎఫ్‌లో ఉద్యోగంలో చేరారు. ఇంద్రవెల్లి, సిరికొండ, నేరడిగొండ మండలాల్లో మరో ఆరుగురు ఉద్యోగాలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇందుకు సహకరించిన ఇస్లాంనగర్‌కు చెందిన ఇద్దరు, కేశవపట్నంకు చెందిన మరోవ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. తాజాగా జరిగిన సంఘటనలో సైతం కేశవపట్నం, గుండాల, ఇస్లాంపుర కాలనీలకు చెందిన నిందితులు ఉండడం గమనార్హం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement