ఇంటర్‌ కళాశాలల్లో క్వాలిటీ ఫుడ్‌.. | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ కళాశాలల్లో క్వాలిటీ ఫుడ్‌..

Aug 5 2026 1:41 AM | Updated on Aug 5 2026 1:41 AM

● విద్యార్థుల ఆరోగ్య భద్రతపై ఫోకస్‌ ● శానిటేషన్‌, న్యూట్రిషన్‌ కమిటీల ఏర్పాటు

మంచిర్యాలఅర్బన్‌: విద్యార్థుల ఆరోగ్య భద్రతపై ఇంటర్‌ విద్యాశాఖ దృష్టి సారించింది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఆహార నాణ్యత ప్రమాణాలు, పరిశుభ్రమైన క్యాంపస్‌ వైపు అడుగులు వేస్తోంది. విద్యార్థులకు పోషకాహర పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు న్యూట్రిషన్‌ కమిటీలు, పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై శానిటేషన్‌ కమిటీలు ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

కమిటీల ఏర్పాటు ఇలా..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 47 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 19,950 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక నుంచి ఇంటర్‌ కళాశాలల్లో న్యూట్రిషన్‌, శానిటేషన్‌ నిర్వహణ బాధ్యతలు అధ్యాపకులు, విద్యార్థులకు అప్పగించనున్నారు. ఫుడ్‌ కమిటీలో ఇద్దరు అధ్యాపకులు, పది మంది విద్యార్థులు, శానిటేషన్‌లో ఒక అధ్యాపకుడు (నోడల్‌ లెక్చరర్‌), ఇద్దరు విద్యార్థులు ఉండనున్నారు. ఫుడ్‌ కమిటీ విద్యార్థుల ఆరోగ్యం, పౌష్టికాహారంపై పరిశుభ్రత, పారిశుద్ధ్యం పనులపై శానిటేషన్‌ కమిటీ పర్యవేక్షించనుంది. ఆహారంలో నాణ్యత, రుచి లేకుంటే ఆరోగ్యంపై ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో మెనూ మార్చడం, ఫుడ్‌ క్వాలిటీ చెక్‌ చేయడంలో ఫుడ్‌ కమిటీలు ఎక్కువగా దృష్టి సారించనున్నాయి.

ఫుడ్‌ (న్యూట్రిషన్‌) కమిటీల బాధ్యతలు

విద్యార్థులకు అందించే ఆహార నాణ్యత పర్యవేక్షణలో ఫుడ్‌ కమిటీలు కీలకం కానున్నాయి. ప్రతీ రోజు అందించే ఆహార వివరాలు, విద్యార్థుల సంఖ్య, లోపాలు, ఆలస్యాలను న్యూట్రిషన్‌ స్కీం రిజి ష్టర్‌లో నమోదు చేస్తారు. తాగునీటి నాణ్యతపై దృష్టి సారిస్తారు.

పరిశుభ్రత పర్యవేక్షణకు..

విద్యార్థులు, సిబ్బంది ఆరోగ్యం, పరిశుభ్రతను పరిరక్షించడానికి శానిటేషన్‌ కమిటీలు అత్యంత కీలకం. తరగతి గదులు, ల్యాబ్‌లు, లైబ్రరీ, కళాశాల ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచడం. డస్ట్‌బిన్‌ల ఏర్పాటు, విద్యార్థులకు వ్యక్తిగత శుభ్రత, పరిశుభ్రమైన అలవాట్లపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం. విద్యార్థుల సంఖ్యను బట్టీ ఇందుకు అవసరమైన స్వీపర్‌, స్కావెంజర్‌ను నియమించుకునే వీలుంటుంది. ఇందుకు కళాశాల ఫెసిలిటీ మెయింటనెన్స్‌ గ్రాంటు కింద రూ.12 వేల నుంచి రూ.20 వేల వరకు నిధులు వెచ్చించే వెసులుబాటు కల్పించారు. ఆరోగ్యకరమైన క్యాంపస్‌కు విద్యార్థుల భాగస్వామ్యంతో కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు డీఐఈవో అంజయ్య తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement