మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలో ప్రైవేటు అంబులెన్సుల ఆగడాలు మితిమీరుతున్నాయి. రోగులను తరలించడంలో వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికే నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదులు అందుతుండగా, సోమవారం రాత్రి జరిగిన సంఘటన అమానుషంగా ఉంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ సమీపంలో నివాసం ఉంటున్న వెలగపూడి నాగభూషణం (65) సోమవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికాగా, తమకు తెలిసిన అంబులెన్సులో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. బాధిత కుటుంబ సభ్యులు అదే అంబులెన్సులో మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకువచ్చి శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని తీసుకెళ్తుండగా ఆసుపత్రి వద్ద ఉన్న అంబులెన్సు సిబ్బంది మార్గమధ్యలో అడ్డుకున్నారు. సీరియల్ నంబర్ తమదని, తమ అంబులెన్సులోనే మృతదేహాన్ని తీసుకెళ్లాలని, వాగ్వాదానికి దిగారు. అంబులెన్సును తిరిగి ఆసుపత్రికి రప్పించి, వారి అంబులెన్సులో మృతదేహాన్ని ఇంటికి తరలించినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. చనిపోయిన బాధలో ఉన్న వారితో అంబులెన్సు నిర్వాహకులు ప్రవర్తించిన తీరు జిల్లా కేంద్రంలో చర్చనీయాంశం కాగా, ఈ ఘటనపై పోలీసులను సంప్రదించగా, ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.


