ఆదిలాబాద్‌టౌన్: సర్కారు వైద్యానికి సుస్తీ నెలకొంది. రోగులకు నాణ్యమైన వైద్యం అందడం లేదు. జిల్లాలోని ఏరియా ఆస్పత్రులు, ఉట్నూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రితో పాటు రిమ్స్ పరిస్థితి దయనీయంగా ఉంది. వైద్యుల కొరత, అరకొర మందులు, యంత్రాలు మూలనపడడంతో చేయని టెస్టులు, అందుబాటులో ఉండని వైద్యులు వెరసీ రోగుల పాలిట శాపంగా మారుతోంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో జనం ప్రైవేట్ ఆస్పత్రుల్లో వేలాది రూపాయలు వెచ్చించి వైద్యసేవలు పొందాల్సిన దుస్థితి. జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న రిమ్స్‌లో వైద్యులు మధ్యాహ్నం దాటితే కనిపించరంటే అతిశయోక్తి కాదు. ఒంటిగంట తర్వాత వారు తమ క్లినిక్‌లలో బిజీగా మారుతున్నారు. లక్షల వేతనం పొందుతున్నా పేదలకు మాత్రం సేవలు అందించేందుకు ముందుకు రావడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలుతుండడంతో ఆస్పత్రులకు రోగుల తాకిడి పెరిగింది. ఓపీ కిక్కిరిసిపోతోంది. జిల్లా కేంద్రంలోని రిమ్స్‌తో పాటు ఉట్నూర్‌లోని జిల్లా ఆస్పత్రి, బోథ్, నార్నూర్ ఏరియా ఆస్పత్రుల పరిస్థితులపై గ్రౌండ్ రిపోర్ట్.
ఏరియా ఆస్పత్రుల్లో..
జిల్లాలోని బోథ్, నార్నూర్‌లో ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. వీటి పరిస్థితి దయనీయంగా ఉంది. బోథ్‌లో ముగ్గురు వైద్యులతోనే సేవలు అందిస్తున్నారు. పలు పోస్టులు ఖాళీగా ఉన్నా యి. స్పెషలిస్ట్ వైద్యులు లేకపోవడంతో రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నార్నూర్‌లో ఏరియా ఆస్పత్రిగా మార్చినా ఇంకా పీహెచ్‌సీ తరహాలోనే సేవలు కొనసాగుతున్నాయి. ఇక్క డ ఒక్కరు కూడా రెగ్యులర్ వైద్యులు లేరు. ఇద్ద రు ఆర్‌బీఎస్‌కే వైద్యులకు డిప్యూటేషన్‌పై కేటా యించారు. వారితోనే సేవలు అందుతున్నాయి.


