ఉమ్మడి జిల్లాతో పాటు మహారాష్ట్ర వాసులకు రిమ్స్ పెద్ద దిక్కుగా ఉంది. అయితే వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇక్కడ పనిచేసే కొందరు డిప్యూటేషన్‌పై ఉండడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. రేడియాలజీ విభాగంలో ఒక్కరే ఉన్నారు. సదరు వైద్యుడు ఉదయం నుంచి రాత్రి వరకు సేవలందిస్తున్నా.. రోగులు గంటల తరబడి నిరీక్షిస్తున్న పరిస్థితి. రెగ్యులర్ వైద్యులతో పాటు కాంట్రాక్ట్ వైద్యులు మధ్యాహ్నమే ఇంటిబాట పడుతున్నారు. బయోమెట్రిక్ ఉన్నా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తున్నారనే విమర్శలున్నాయి. ఫార్మసీలో మందులు అందుబాటులో ఉండడం లేదు. రోగులు అక్కడికి వెళితే ఒకట్రెండు మందు గోలీలు ఇచ్చి మిగతావి ప్రైవేట్‌లో కొనుగోలు చేయాలని చెబుతున్నారు. దీంతో వారిపై ఆర్థిక భారం పడుతోంది. ఇక టీహబ్‌లో యంత్రాలు మరమ్మతుకు గురికావడంతో పరీక్షలు జరగడం లేదు. 51 రకాల పరీక్షలు చేస్తామని చెప్పినప్పటికీ మూడు నుంచి నాలుగు రకాలు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. థైరాయిడ్, సీబీపీ, హెచ్‌బీఏ1సీ, విటమిన్ టెస్టులు తదితరవి కొన్ని నెలలుగా చేయడం లేదు. ఏసీలు పనిచేయకపోవడంతో యంత్రాలు చెడిపోతున్నాయని సిబ్బంది చెబుతున్నారు.


