హరి ఓం విఠల..! | - | Sakshi
Sakshi News home page

హరి ఓం విఠల..!

Jul 22 2026 11:29 AM | Updated on Jul 22 2026 11:29 AM

పదం కలుపుతూ.. పాదం కదుపుతూ.. పాండురంగని చెంతకు పండరీపుర యాత్ర ఆషాఢంలో ఆధ్యాత్మిక వైభవం ఏకాదశి రోజున విఠోబా దర్శనం

భైంసా: తెల్లవారుజామున ఆకాశంలో తొలి వెలుగు విరిసేవేళ.. పచ్చనిపొలాల మధ్య ఉన్న మట్టిరోడ్డుపై నుంచి తాళాల మోగింపు వినిపిస్తోంది. కొద్ది క్షణాల్లోనే ఆ నాదం మరింత ఉధృతమైంది. కాషాయ జెండాలు గాలికి రెపరెపలాడుతున్నాయి. తెల్లని దుస్తులు, తలపై మరాఠీ టోపీలు, మెడలో తులసీమాలలు ధరించిన వే లాదిమంది ఒకే ల యలో పాదం కదుపుతూ.. పదం క లుపుతూ అడుగులు వేస్తున్నారు. వారందరి నో టా ఒకటే నా మం.. ‘విఠల.. విఠల.. విఠల.. హరి ఓం విఠల..’ ఆ నామస్మరణతో గాలి కూడా పవిత్రమవుతుందేమో అనిపిస్తుంది. వాళ్ల అడుగులు ముందుకు కదులుతున్నా... వారి మనసులు మాత్రం పాండురంగడి పాదాల వద్దే నిలిచిఉంటాయి. ఈ మహాయాత్రలో నిర్మల్‌ జిల్లా కూడా ఏటా భాగమవుతోంది. జిల్లా నుంచి వేలాదిమంది విఠోబా(పాండురంగడి) భక్తులు ఏకాదశి పర్వదినాన ఆ స్వామిని దర్శించుకునేందుకు పండరీపురానికి కాలినడకన బయలుదేరి వెళ్లారు.

250 కిలోమీటర్లు కాలినడక..

ఈ నెల 8న మహారాష్ట్రలోని పూణే జిల్లా అలందిలో ప్రారంభమైన యాత్ర షోలాపూర్‌ జిల్లాలోని పండరీపూర్‌కు ఈనెల 24న చేరుకుంటుంది. నిండా ఆధ్యాత్మికతతో 250 కిలోమీటర్లు నడుస్తూనే ఉంటారు. దాదాపు 700 ఏళ్లుగా ఈ యాత్ర కొనసాగుతుందని భక్తులు చెబుతున్నారు. ప్రతీ ఆషాఢ మాసంలో లక్షలాది మంది ఒకే దిశగా నడుస్తూనే ఉంటారు. వారి గమ్యం ఒక్కటే.. పండరీపూర్‌లో నడుముపై రెండు చేతులు పెట్టుకుని ఇటుకపై నిల్చుని ఎదురు చూస్తున్న విఠోబా దర్శనం.

భక్తి ఉద్యమానికి ప్రాణం..

మహారాష్ట్రలో పుట్టిన భక్తి ఉద్యమ ప్రభావం జి ల్లా పై తీవ్రంగా ఉంది. అలాంటి భక్తి ఉద్యమానికి ప్రా ణం పోసింది ఈ వార్కారీ యాత్ర అని చెప్పవచ్చు. 13వ శతాబ్దంలో సంత్‌ జ్ఞానేశ్వరుడు వెలిగించిన ఈ భక్తి దివ్వెను 1685 నుంచి నారాయణ్‌ మహారాజ్‌ ‘వార్కారీ’గా మలిచారు. అప్పటి నుంచి ఏటా 10 నుంచి 15 లక్షలమంది ప్రతీ ఆషాఢంలో పండరీపురానికి కాలినడకన కదులుతూనే ఉన్నారు. దాదాపు 21 రోజులపాటు సాగే యాత్రలో మార్గమధ్యలో ఆలయాలను దర్శిస్తూ.. సంత్‌ తుకారాం అభంగాలు, భజనలు ఆలపిస్తూ.. పాండురంగడి భక్తిలో మైమరచిపోతారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులూ యువకుల వేగానికి తగ్గట్లు పాటలు పాడుతూ హుషారుగా అడుగులు వేయడం వార్కారీలో కనిపిస్తుంది. దారి పొడవునా గ్రామాలు వీరికి స్వాగతాలు పలకడం, అన్నదానాలు చేయడం ప్రజల్లో ఐక్యతను మరింత పెంచుతున్నాయి. ఎక్కడ ఆగితే అక్కడ రాత్రంతా భజనలు, అభంగాలు, హరికథలతో ఆ ఊరంతా ఆధ్యాత్మిక క్షేత్రంగా మార్చేస్తారు.

పండరీపుర యాత్రలో బృందాలుగా సాగుతారు. ఈ బృందాన్ని ‘దిండి’ అంటారు. ఇది కేవలం ఒక బృందం కాదు... ఒక కుటుంబంలా ఉంటుంది. ఎలాంటి భేదాలు, తారతమ్యాలు లేకుండా అందరూ కలిసి నడుస్తారు. ఎవరికై నా కష్టం వస్తే మిగతావాళ్లు చేయూతనిస్తారు. ఇక్కడ ధనికుడు, పేదవాడు అనే తేడా ఉండదు. అందరూ విఠోబా బిడ్డలే.. అని భావిస్తారు. ప్రతి ఒక్కరూ తులసీమాల ధరించి, సాత్వికాహారం తీసుకుంటూ, విఠల నామస్మరణ చేస్తూ, పరిశుభ్రత పాటిస్తారు. ఈ నెల 24న పండరీపురం చేరుకుని 25న ఆషాఢ ఏకాదశి పర్వదినాన పాండురంగడిని దర్శించుకుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement