మొత్తం పాఠశాలలు : 1,494
జిల్లాలో
విద్యార్థులు : 1.60 లక్షలు
ఆదిలాబాద్‌టౌన్: బడి బ్యాగు భారమవుతోంది. పుస్తకాల మోత వారి అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది. వయసుకు మించి బరువు మోయలేక బాల్యం తంటాలు పడుతోంది. విద్యార్థులపై పుస్తకాల భారం ఉండకూడదనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు మార్గదర్శకాలను రూపొందించాయి. నూతన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ–2020)లోనూ విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్న విషయం తెలిసిందే. అయినా క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ముఖ్యంగా ప్రైవేట్ విద్యాసంస్థల్లో పుస్తకాలు, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్ పేరుతో చిన్నారులపై అధిక భారం మోపుతున్నారనే విమర్శలున్నాయి. ఒకప్పుడు పదో తరగతి వరకు కూడా ఆరు నోట్‌బుక్స్, ఆరు టెక్ట్స్ బుక్స్ మాత్రమే ఉండేవి. ప్రస్తుతం ప్రైవేట్‌లో ఎల్‌కేజీ విద్యార్థికి కనీసం పది పుస్తకాలు, అదనంగా నోట్‌బుక్స్ ఉండడం గమనార్హం. దీంతో ఇటు పిల్లలకు బడిబ్యాగు భారం కాగా, అటు తల్లిదండ్రులకు ఆర్థిక భారం తప్పని పరిస్థితి.
శరీర బరువులో 10 శాతానికి మించకుండా..
కేంద్ర విద్యాశాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం స్కూల్ బ్యాగ్ విద్యార్థి శరీర బరువులో 10 శాతానికి మించకూడదని స్పష్టం చేస్తుంది. అలాగే రోజువారీ టైమ్‌టేబుల్‌కు అవసరమైన పుస్తకాలనే తీసుకురావాలని పేర్కొంది. విద్యార్థులకు లాకర్ సౌకర్యం కల్పించడం, డిజిటల్ లెర్నింగ్‌ను ప్రోత్సహించడం, హోంవర్క్ పరిమితం చేయడం వంటి సూచనలు కూడా ఉన్నాయి.
ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం..
అధిక బరువున్న బ్యాగులను రోజూ మోయడంతో చిన్నారుల్లో మెడ, భుజం, నడుము నొప్పితో పాటు వెన్నెముకపై ఒత్తిడి వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్న వయసులోనే శరీర భంగిమలో మార్పులు రావడంతో పాటు కండరాలపై అధిక ఒత్తిడి ఏర్పడి భవిష్యత్తులో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రభుత్వం నిబంధనలు రూపొందించినా వాటిని చాలా పాఠశాలలు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.
ప్రైవేట్‌లో పరిస్థితి భిన్నం..
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం..
తరగతి పుస్తకాల బరువు
1, 2 1.5 – 2 కిలోలు
3,4,5 2 – 3 కిలోలు
6, 7 4 కిలోల వరకు
8, 9 4.5 కిలోల వరకు
10 5 కిలోల వరకు
ప్రభుత్వ మార్గదర్శకాల అమలుపై విద్యాశాఖ అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. బ్యాగ్ బరువును పరిశీలించడం, నిబంధనలు పాటించని విద్యాసంస్థలకు నోటీసులు జారీ చేయడం, అవసరమైతే చర్యలు తీసుకోవడంతోనే పరిస్థితిలో మార్పు వస్తుందని పేర్కొంటున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా ప్రతి పాఠశాలలో అమలయ్యేలా పటిష్ట చర్యలు అవసరమని విద్యావేత్తలు సూచిస్తున్నారు. పుస్తకాల భారం తగ్గినప్పుడే పిల్లలు ఉల్లాసంగా, ఆరోగ్యంగా విద్యాభ్యాసాన్ని కొనసాగించగలరని అభిప్రాయపడుతున్నారు.
పర్యవేక్షణ లోపం..
జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రతీ సబ్జెక్టుకు టెక్ట్స్ బుక్స్, క్లాస్‌వర్క్, హోంవర్క్, వర్క్‌బుక్, అసైన్‌మెంట్ బుక్, ప్రాక్టీస్ బుక్ పేరిట ఐదు నుంచి ఆరు పుస్తకాలు తీసుకురావాలని సూచిస్తున్నారు. దీంతో చిన్నారులు రోజూ 5 నుంచి 8 కిలోల వరకు బరువున్న బ్యాగులను మోయాల్సి వస్తోందని తల్లిదండ్రులు చెబుతున్నారు. కొన్ని పాఠశాలల్లో లాకర్ సదుపాయం లేకపోవడంతో విద్యార్థులకు మోత భారం తప్పడం లేదు.


