నస్పూర్: శ్రీరాంపూర్ ఏరియాలో పదవీ విరమణ పొందిన ప్రతీ ఉద్యోగికి టెర్మినల్ బెన్‌ఫిట్స్ వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని శ్రీరాంపూర్ ఏరియా జీఎం శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆయన జీఎం కార్యాలయంలో శ్రీరాంపూర్ ఏరియాలోని అన్ని భూగర్భ గనులు, ఓపెన్‌కాస్టుల మేనేజర్లు, సంక్షేమ అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గనుల వారీగా పదవీ విరమణ పొందిన ఉద్యోగుల రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ చెల్లింపు వివరాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. గ్రాట్యూటీ, సీఎంపీఎఫ్, పెన్షన్ పెండింగ్ వివరాలు సేకరించారు. ఒక్కో గనిలో ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి, ఏ ఏ కారణాలతో పెండింగ్‌లో ఉన్నాయో తెలుసుకుని త్వరగతిన పూర్తిచేయాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కారుణ్య నియామకాల ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. అర్హత లేనివారు, ఉద్యోగం అవసరం లేని వారికి ఎల్‌ఎస్‌పీ, ఎంఎంసీ పొందే వెసులుబాటు కల్పించాలన్నారు. అదేవిధంగా ఉద్యోగి అతని కుటుంబ సభ్యుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియను త్వరగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డీజీఎం పర్సనల్ ఎస్.అనిల్‌కుమార్, డీవైపీఎంలు రాజేశ్, కిరణ్, సీనియర్ పీఓలు సురేందర్, మురళీ, ప్రశాంత్, వివిధ గనుల మేనేజర్లు, గనుల సంక్షేమాధికారులు తదితరులు పాల్గొన్నారు.


