‘ఎక్స్‌లెన్స్’ కేజీబీవీలు
ఆదిలాబాద్‌టౌన్: కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో ఇక ఎక్స్‌లెన్స్ చదువు అందనుంది. కార్పొరేట్, ప్రైవేట్‌కు ధీటుగా నాణ్యమైన బోధన అందించాలని నిర్ణయించింది. యంగ్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు సంబంధించి విద్యార్థులకు జేఈఈ, నీట్, లాసెట్ వంటి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. రాత పరీక్ష ద్వారా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసి పోటీ పరీక్షలకు సంసిద్ధం చేయనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ ప్రక్రియ అమలు కానుంది. చాలామంది విద్యార్థులు ఆర్థిక పరిస్థితుల కారణంగా దూర ప్రాంతాల్లో శిక్షణకు వెళ్లకుండా ఇంజినీరింగ్, వైద్య, లా కోర్సుల్లో చేరలేకపోతున్నారు. ఇంటి వద్దనే సిద్ధమవుతూ అవగాహన లేక వాటిలో రాణించలేకపోతున్నారు. ఇలాంటి వారి కోసం ప్రభుత్వం జిల్లాలో మూడు కేజీబీవీలను ఎంపిక చేసింది. ఇందులో విద్యార్థులకు ఇంటర్‌తో పాటు ఆయా ప్రవేశ పరీక్షలకు నిపుణులతో శిక్షణ అందించనున్నారు.
మూడు కేజీబీవీల్లో..
జిల్లాలో 18 కేజీబీవీలు ఉన్నాయి. 6 నుంచి ఇంటర్ వరకు ఇక్కడ విద్యాబోధన ఉంటుంది. ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ విద్యాలయాల్లో మొత్తం 4,620 మంది విద్యనభ్యసిస్తున్నారు. అయితే వీరంతా పేద విద్యార్థులే. ప్రభుత్వం ఈ ఏడాది యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కింద మూడు సీవోఈలను ఎంపిక చేసింది. ఆదిలాబాద్‌అర్బన్ కేజీబీవీలో ఐఐటీ, జేఈఈకి సంబంధించి శిక్షణ కల్పించనున్నారు. జైనథ్ కేజీబీవీలో నీట్‌తో పాటు ఎప్‌సెట్, అగ్రికల్చర్ తదితర కోర్సులకు సంబంధించి శిక్షణ ఉంటుంది. తలమడుగు కేజీబీవీలో కామన్ లా ఎంట్రెన్స్ టెస్ట్‌కు సంబంధించి శిక్షణ ఇవ్వనున్నారు. అయితే ఈ పాఠశాలల్లో గ్రంథాలయంతో పాటు ఎన్‌సీసీ, ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నారు. వీటికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించింది. అవసరమైన విషయ నిపుణులను సైతం నియమించింది. జూన్ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ అందించనున్నారు.
ఏప్రిల్ 15 వరకు గడువు..
ఈ మూడు కేజీబీవీల్లో వచ్చే ఏడాది ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరానికి సంబంధించి ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా ఈనెల 16 నుంచి ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు గడు వు ఉంది. మే 5న పరీక్ష నిర్వహించనున్నారు. ఎస్సె స్సీ పూర్తి చేసిన వారు అర్హులు. ఎంపికై న విద్యార్థులు జేఈఈ, నీట్, ఎప్‌సెట్, లాసెట్ తదితర ఎంట్రెన్స్ కోచింగ్‌లతో పాటు సీఏకు సంబంధించి కూడా శిక్షణ కల్పించనున్నారు.


