తాంసి: దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. ఎట్టకేలకు ఆ ఊరికి కరెంటొచ్చింది. గ్రామ సమస్యను రెండేళ్ల క్రితం ‘సాక్షి’ ‘ఈ అంధకారం నుంచి స్వాతంత్య్రం ఎప్పుడు?’ శీర్షికన ఏప్రిల్ 4, 2024న వెలుగులోకి తెచ్చింది. ఈ మేరకు స్పందించిన అధికారులు వెంటనే గ్రామాన్ని సందర్శించారు. అవసరమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. రెండేళ్ల పాటు కృషి చేసి ప్రత్యేక విద్యుత్ లైన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ గిరి గ్రామానికి వెలుగులు రావడంతో ఆ ఊరంతా సంబురపడుతోంది. ‘సాక్షి’కి ప్రత్యేక అభినందనలు తెలిపింది.
డీఏజేజీయూఏ పథకం కింద..
భీంపూర్ మండలంలోని కమట్‌వాడ పంచాయతీ పరిధిలో గల జెండాగూడ గ్రామానికి శనివారం తొలిసారిగా విద్యుత్ సరఫరా చేశారు. ధర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ (డీఏజేజీయూఏ) పథకం కింద విద్యుదీకరణ పనులు విజయవంతంగా పూర్తి చేసి సరఫరా చేసినట్లు చీఫ్ ఇంజినీర్ (కన్‌స్ట్రక్షన్) సీఈ చౌహన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలో మొత్తం 13 సర్వీస్ మీటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 1.5 కిలోమీటర్ల మేర 6.3 కేవీలైన్ నిర్మాణం, 0.4 కిలోమీటర్ల ఎల్టీ లైన్, 25 కేవీ సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. కాగా, గ్రామానికి విద్యుత్ సౌకర్యం ఏర్పాటు కావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాల నిరీక్షణ ఫలించిందని పేర్కొన్నారు. అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఈ రాథోడ్ శేషారావు, డీఈ ప్రభాకర్, ఏఈ తిరుపతి రెడ్డి, విద్యుత్ సిబ్బంది ఉన్నారు.


