‘పది’ పరీక్షలు షురూ
ఆదిలాబాద్‌టౌన్: పదో తరగతి పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా 52 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష కొనసాగింది. విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లాలో మొత్తం 10,887 మందికి గాను తొలిరోజు 10,864 మంది హాజరయ్యారు. కలెక్టర్ రాజర్షిషా జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశుమందిర్, ప్రభుత్వ నంబర్–2 పాఠశాలను పరిశీలించారు. అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ నాలుగు కేంద్రాలను, వరంగల్ ఆర్‌జేడీ సత్యనారాయణరెడ్డి ఆరు పరీక్ష కేంద్రాలను, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి ఐదు పరీక్ష కేంద్రాలను, స్క్వాడ్‌లు 16 కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. అలాగే ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలను తనిఖీ చేశారు. బందోబస్తును పరిశీలించారు. ఆయన వెంట డీఎస్పీ జీవన్ రెడ్డి, వన్‌టౌన్ సీఐ సునిల్‌కుమార్ ఉన్నారు.


