● సమాజ మార్పునకు ఆదివాసీల శ్రీకారం ● ఉమ్మడి జిల్లాలో గోండు, కొలాం, పర్ధాన్ పెద్దల తీర్మానం ● ఇప్పటికే పలు గ్రామాల్లో అమలులోకి
వరకట్నం.. వివాహ సమయంలో వధువు కుటుంబం నుంచి వరుడి కుటుంబా నికి నగదు, బంగారం, ఆస్తుల రూపేణ బదిలీ చేసే ఒక సామాజిక దురాచారం. ఆడపడుచు కుటుంబా నికి ఇబ్బందిగా మారిన దీనిని రూపుమాపేందుకు ప్రభుత్వాలు చట్టాలెన్ని చేసినా క్షేత్రస్థాయిలో అమలుకు మాత్రం నోచుకోని దుస్థితి. ఈ క్రమంలో సామాజిక బాధ్యతగా గుర్తించిన ఆదివాసీ తెగలు వరకట్నం నిషేధం వైపు మొగ్గు చూపుతున్నాయి. కట్నం ఇవ్వొ ద్దు.. తీసుకోవద్దు అని గ్రామాల్లో తీర్మానాలతో పాటు అమలుకు శ్రీకారం చుడుతున్నాయి. ‘హైరి కీవల్ సిల్లే’ ‘కట్నం ఇదే కాద్ తోద్’ వంటి తీర్మానాలతో ముందడుగు వేస్తున్న ఆయా తెగలపై ఈ వారం సండే స్పెషల్.
సిరికొండ: ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్లంటే ఆ కుటుంబంపై ఆర్థిక భా రం చెప్పనవసరం లేదు. కట్నా లు, కానుకలు, ఆర్భాటాలు వంటివి చెప్పుకుంటే పోతే పెద్ద లిస్టే అవుతోంది. అలాంటిది తమ గూడెంలో అమ్మాయి పెళ్లిని ఆర్భాటం లేకుండా సంప్రదాయబద్ధంగా నిర్వహించాలని ఊరి పెద్దలు భావించారు. ఈనెల 9న సమావేశమయ్యారు.‘హైరి కీవల్ సిల్లే’ వరకట్నం నిషేధించడంతో పాటు పెళ్లి కూతురు కుటుంబానికి తలా కొంత ఆర్థికంగా చేదోడుగా నిలవాలని నిర్ణయించారు. వెంటనే అమలులోకి తెచ్చారు సిరికొండ మండలంలోని కోసుపటేల్ గూడవాసులు.
సాత్నాల: వరకట్న సమస్య కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుందని కొలాం తెగ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పెళ్లి అనేది పవిత్ర బంధమని.. దానిని డబ్బు, ఆస్తులతో కొలవకూడదని భావించింది. ఇకపై వరకట్నం ఇవ్వొద్దు.. తీసుకోవద్దని నిర్ణయించింది. ఇందులో భాగంగా సాత్నాల మండలంలోని టెంబ్రీగూడలో పటేళ్లు, కులస్తులు ఇటీవల సమావేశమయ్యారు. సాత్నాల, బేల, జైనథ్, ఇంద్రవెల్లి మండలాల్లోని ఆయా గ్రామాలకు చెందిన దాదాపు 150 పాల్గొన్నారు. వరకట్నం అనేది తమ సంస్కతిలో భాగం కాదని నిషేధించాలని తీర్మానం చేశారు. ఆడంబరాలకు వెళ్లి అప్పుల పాలు కావద్దన్నారు. పెళ్లిళ్లు సాంప్రదాయబద్ధంగా ఉండాలని, రూ.లక్షలు ఖర్చయ్యే రెడీమేడ్ మండపాలకు దూరంగా ఉండడంతో పాటు మద్యపానం నిషేధించాలన్నారు. డీజేలు వంటి వాటి జోలికి వెళ్లకుండా పిప్రి వాయిద్యాలతో ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. పెళ్లిలో చదివింపుల్లో భాగంగా వస్తువులు కాకుండా నగదు రూపంలో అందిస్తే కుటుంబాలనికి ఆసరాగా ఉంటుందని తీర్మానించారు.
ఆడబిడ్డ పెళ్లికి ఊరంతా సాయం


