కూర్పు కుదిరేనా?
డీసీసీ కార్యవర్గం కోసం కసరత్తు ‘హస్తం’ పార్టీలో వర్గపోరు నేపథ్యంలో ఎంపిక కత్తిమీద సామే పరిశీలకులు, డీసీసీ అధ్యక్షులకు దరఖాస్తులు త్వరలోనే పీసీసీ నుంచి జాబితా
సాక్షి,ఆదిలాబాద్: జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కా ర్యవర్గం కోసం అధికార పార్టీలో కసరత్తు మొదలైంది. ఇటీవల పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నరేశ్ జాదవ్‌ను ప్రకటించినప్పటికీ కార్యవర్గం ఏర్పాటు చేయలేదు. రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు రాష్ట్ర ఉర్దూ అకాడమి చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ సోమవారం ఆదిలాబాద్ చేరుకుని జిల్లా అధ్యక్షుడు నరేశ్‌జాదవ్‌తో కలిసి ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మంగళవారం కూడా ఈ ప్రక్రియ కొ నసాగింది. బుధవారం పరిశీలకులు నివేదిక రూ పొందించి టీపీసీసీకి పంపనున్నారు. అక్కడి నుంచి జనవరి 1 తర్వాత ఎప్పుడైనా జాబితా వెలువడవచ్చని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
పోటాపోటీ..
జిల్లా కమిటీలో ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, కోశాధికారి వంటి పదవులతో పాటు కార్యవర్గ సభ్యులు, ఇతర విభాగాలకు పర్సన్స్‌ను ఎంపిక చేసేందుకు పరిశీలకులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమ, మంగళ రెండు రోజుల పాటు నిర్వహించిన సమావేశంలో ఈ ప్రక్రియ కొనసాగింది. సుమారు 260 వరకు దరఖాస్తులు వచ్చినట్లు చెబుతున్నారు. భారీగా వచ్చిన దరఖాస్తుల నేపథ్యంలో ఎంపిక కత్తిమీద సాములా మారింది.
మెజార్టీ పదవులు పాత నాయకులకేనా..
కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు నుంచి పార్టీ లో కొనసాగుతున్న పాత నాయకులకు కార్యవర్గంలో సముచిత స్థానం కల్పించాలని అధిష్టానం నిర్ణయించింది. 60నుంచి 80 శాతం పాత వారికే చోటు కల్పించాలని ఆదేశాలున్నాయి. 20నుంచి 30 శాతం వరకు కొత్తగా చేరిన వారికి అవకాశం కల్పించేందు కు పరిశీలన చేస్తున్నారు. సామాజిక సమీకరణాల ను కూడా పరిగణలోకి తీసుకోనున్నారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇలా అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించే విధంగా పరిశీలన చేస్తున్నారు. మంగళవా రంతో దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. నివేదికను టీపీసీసీకి పంపనున్నారు. జనవరి 1 తర్వాత ఎప్పుడైనా అక్కడి నుంచి కార్యవర్గం జాబితా వెలువడే అవకాశముంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు.
వర్గపోరు నేపథ్యంలో..
కాంగ్రెస్‌లో తీవ్ర వర్గపోరు నెలకొంది. పార్టీలో ఇటీవల తిరిగి చేరిన గండ్రత్ సుజాత, సాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డితో పాటు కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గణేశ్‌రెడ్డి, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి, బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆడే గజేందర్ వంటి ముఖ్య నేతల అనుచరులు జిల్లా కార్యవర్గంతో పాటు మండల అనుబంధ సంఘాల్లో ప్రధాన పదవుల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వారు పరిశీలకులతో పాటు జిల్లా అధ్యక్షుడిపై తమ అనుచరులకు సమప్రాధాన్యత ఇవ్వాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని పాత, కొత్త నాయకులకు ప్రాధాన్యత కల్పిస్తామని, మొత్తంగా పార్టీ అభ్యున్నతి కోసం పాటుపడే వారికి కమిటీలో చోటు ఉంటుందని పార్టీ అధిష్టానం చెబుతుంది. ఇదిలా ఉంటే ఇప్పటివరకు కమిటీల్లో కొనసాగుతున్న వారికి తిరిగి కొనసాగించే అవకాశాలు లేవని పార్టీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. కమిటీ పూర్తిగా కొత్తగా ఉంటుందని చెబుతున్నారు. ఈ అంశాలన్నీ హస్తం పార్టీలో ఆసక్తి కలిగిస్తున్నాయి.


