‘మున్సిపల్’ సందడి
ఓటర్ల జాబితా రూపకల్పనలో అధికారులు నిమగ్నం ప్రయత్నాలు షురూ చేసిన ఆశావహులు రిజర్వేషన్లపై వీడని స్పష్టత
కై లాస్‌నగర్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కసరత్తు మొదలైంది. పోలింగ్ కేంద్రాలు, వార్డుల వారీ గా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలంటూ రాష్ట్ర ఎన్ని కల సంఘం ఆదేశాలు జారీ చేసింది. తదనుగుణంగా మున్సిపల్ అధికారులు చర్యలు షురూ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ప్రకారం పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్లను విభజించే పనిలో నిమగ్నమయ్యారు. ముసాయిదా ఓటరు జాబితాను జనవరి ఒకటో తేదీన ప్రకటించాలనే ఈసీ ఆదేశాల కు అనుగుణంగా వ్యవహరిస్తున్నారు.ఎన్నికల నిర్వ హణకు ఎక్కువ సమయం లేకపోవడంతో వా ర్డుల పునర్విభజన జోలికి వెళ్లకుండా పాత వార్డుల ప్రకా రమే నిర్వహించే అవకాశముంది. ఇదిలాఉంటే ము న్సిపల్ ఎన్నికలకు సై అంటున్న ఆశావహులు తమ ప్రయత్నాలను షురూ చేశారు. బరిలో ఉంటామని తెలిపేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఓటర్లను ఆకర్శించే పనిలో పడ్డారు.
ఓటరు జాబితాలతో కుస్తీ..
పోలింగ్ కేంద్రాలు, వార్డుల వారీగా ఓటర్లతో కూడి న ముసాయిదా జాబితాను ఈ నెల 31న ప్రకటించాలని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. ఇందుకు సమ యం ఎక్కువగా లేదు. దీంతో గడువులోపు జాబితా ఎలాగైనా సిద్ధం చేసే దిశగా మున్సిపల్ అధికారులు చర్యలు ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికల సమ యం నాటి ఓటర్ల జాబితాలను రెవెన్యూ అధికారు ల నుంచి తెప్పించుకున్నారు. వాటి ప్రకారం ఆది లాబాద్ మున్సిపల్ పరిధిలో 1,04,159 మంది ఓటర్లు ఉండగా 148 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దీంతో వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్లను విభజించేందుకు మున్సి పల్ సమావేశ మందిరంలో ఆ జాబితాలతో కుస్తీ ప డుతున్నారు. కుటుంబంలోని ఓటర్లంతా ఒకే పో లింగ్ కేంద్రం పరిధిలో ఉండేలా చూస్తున్నారు. పురుషులు, మహిళలు వార్డుల వా రీగా ఎంత మంది ఉన్నారనే లెక్క తేల్చనున్నారు. బుధవారం వరకే గడువు ఉండటంతో ముసాయిదాను యుద్ధ ప్రతిపాదికన పూర్తిచేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ సీవీఎన్. రాజు పర్యవేక్షించారు. జనవరి 1న పట్టణంలోని వార్డుల వారీగా సిద్ధం చేసిన ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు.
ఆశావహుల ప్రయత్నాలు షురూ
ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధమవడం, అధికారులు కసరత్తు ప్రారంభించడంతో ఆశవాహులు సైతం తమ ప్రయత్నాలు షురూ చేశారు. రిజర్వేషన్లపై ఇంకా ఎలాంటి స్పష్టత రానప్పటికి, త్వరలో నోటిఫికేషన్ వచ్చే అవకాశముండటంతో పోటీకి సై అంటున్నవారు అంతర్గతంగా ప్రచారం మొదలు పెట్టారు. ఇందుకు సోషల్ మీడియాను ప్రధాన అస్త్రంగా వాడుకుంటున్నారు. రాజకీయ పార్టీల గుర్తుల ఆధారంగా జరిగే ఎన్నికలు కావడంతో తమ పార్టీల ప్రాధాన్యతను చాటేలా పేస్‌బుక్, ఇన్‌స్ట్రాగాం, వాట్సా ప్‌ల్లో ప్రచార పర్వం మొదలెట్టారు. ఓటర్లను ఆకర్షించేలా పోస్టులు పెడుతున్నారు. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్‌ఎస్‌లు తమ తమ ప్రభుత్వాలు చేసిన, చేస్తున్న అభివృద్ధి పనులను వివరించేలా పోస్టుల్లో పొందుపరుసున్నారు. నూతన సంవత్సరంలో నిర్వహించే మున్సిపల్ ఎన్నికలకు త్వరలో నగారా మోగనున్నట్లుగా పరిస్థితులు ఉండటంతో ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో అనధికారికంగా వార్డుల్లో ఎన్నికల సందడి మొదలైంది. నోటిఫికేషన్ విడుదలైతే రాజకీయం మరింత వేడెక్కనుంది. అయితే ఎన్నికల నిర్వహణకు సమయం ఎక్కువగా లేకపోవడంతో వార్డుల పునర్విభజన జరిగే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. పాత వార్డుల ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయని అభిప్రాయపడుతున్నారు.


