ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే పీడీయాక్ట్
● మున్సిపల్ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తి రిమాండ్ ● ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి
ఆదిలాబాద్‌టౌన్: ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే పీడీయాక్ట్ కేసులు నమోదు చేస్తామని ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మేరకు వివరాలు వెల్లడించారు. పట్టణంలో కోట్ల రూపాయల మున్సిపల్ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. పట్టణంలోని భుక్తాపూర్‌కు చెందిన ఏ–2 అక్రమ్ మున్సిపల్ ఖాళీ స్థలాన్ని ఆక్రమించాలనే ఉద్దేశంతో తన బంధువు షాబొద్దీన్ పేరిట దస్తావేజులు సృష్టించినట్లు తెలిపారు. 35 ఏళ్లుగా అక్కడే ఉంటున్నట్లు ఇంటినంబర్ తీసుకున్నాడు. అక్రమ పద్ధతిలో రిజిస్ట్రేషన్ నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదుతో పలు కేసులు నమోదు చేసినట్లు వివరించారు. భుక్తాపూర్‌లో 469.44 స్వేర్ యార్డ్స్ ఆక్రమించి ఇంటి నం.6–6–36/2/1 తీసుకున్నాడు. మున్సిపల్ సిబ్బంది పాత్రపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అక్రమ పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారిపై నాన్‌బెయిలబుల్ కేసులతోపాటు పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. ల్యాండ్ మాఫియా, రౌడీలు గతంలో బెదిరింపులకు పాల్పడి రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే పోలీసులను ఆశ్రయించాలన్నారు. సమావేశంలో వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్, పోలీసుసిబ్బంది పాల్గొన్నారు.


