సమస్యలపై నిలదీస్తే అరెస్ట్‌ చేస్తారా?.. డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు

- - Sakshi

ఆదిలాబాద్‌: ప్రజాసమస్యలపై రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను నిలదీయడానికి వస్తే అక్రమంగా అరెస్ట్‌ చేస్తారా? అని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరి రావు ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్‌ పర్యటన నేపథ్యంలో దిలావర్‌పూర్‌ మండలం గుండంపల్లి హెలీప్యాడ్‌ వద్దకు వెళ్లిన శ్రీహరిరావును బుధవారం అరెస్ట్‌ చేసి సారంగపూర్‌ పోలీస్టేషన్‌కు తరలించారు.

ఈక్రమంలో పోలీసుల తీరును నిరసిస్తూ సారంగపూర్‌ పోలీస్టేషన్‌ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం ఆయన పోలీస్‌స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు. గుండంపల్లిలోని కాళేశ్వరం ప్యాకేజీ నంబర్‌ 27 అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టును ఎలా ప్రారంభిస్తారో.. చెప్పాలని డిమాండ్‌ చేశారు. దిలావర్‌పూర్‌ మండలంలో పచ్చని పంటపొలాల మధ్య విషవాయువు వెలువరించి ప్రజల ప్రాణాలు, పచ్చటి పంటపొలాలకు హాని కలిగించే ఇథనాల్‌ ఫ్యాక్టరీ నిర్మించడం వెనుక మరమ్మమేమిటో తెలుపాలని పేర్కొన్నారు.

వెంటనే దానిని రద్దు చేయాలని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడవద్దని తెలిపారు. నిర్మల్‌ మున్సిపాలిటీలో అక్రమంగా 42 ఉద్యోగాలు అమ్ముకున్నారని తేలినప్పటికీ రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదో? ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇంత దారుణమైన పాలన సాగిస్తూ నియంతలా వ్యవహరిస్తున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి, ప్రజలకు సమాధానం చెప్పలేని మంత్రులకు ప్రజలే తగిన బుద్ధిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికల్లో ప్రజలు తిరగబడతారని, ఓటు హక్కుతో బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. సమర్థవంతమైన పాలన అందించే కాంగ్రెస్‌నే ప్రజలు కోరుకుంటున్నారని, తప్పకుండా రాష్ట్రంలో ఆ పార్టీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తంజేశారు. ఈయన వెంట కాంగ్రెస్‌ నాయకులు అరుగుల రమణ, విలాస్‌రావు, బొల్లోజి నర్సయ్య, రొడ్డ మారుతి, అబ్దుల్‌ హాదీ, న్యాయవాది మల్లారెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ వజీద్‌ అహ్మద్‌, పొడెల్లి గణేశ్‌ తదితరులున్నారు.

Read latest Adilabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top