దసరా పండగకు ఇంటికొచ్చిన కుమారుడు.. తల్లిదండ్రులతో ఆనందంగా గడపాల్సిన సమయంలో విగతజీవిగా మారాడు. తల్లిదండ్రుల కళ్లెదుటే ఒక్కసారిగా కుప్పకూలి గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు ఇక లేడన్న వార్తతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని గండగలపాడులో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
వైరా పదో వార్డు కౌన్సిలర్ కిన్నెర కృష్ణ, విజయ దంపతుల కుమారుడు రాఘవ్ (19) హైదరాబాద్లోని ఓ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. దసరా సెలవుల నేపథ్యంలో రెండు రోజుల క్రితమే ఇంటికి వచ్చాడు. శుక్రవారం ఉదయం ద్విచక్రవాహనంపై దుస్తులు విక్రయించే వ్యక్తి వారి ఇంటికి వచ్చాడు. తల్లి దుస్తులు చూస్తుండగా.. మంచంపై కూర్చున్న రాఘవ్ ‘నాన్నా.. నీకు ఈ చొక్కాలు బాగుంటాయి’ అంటూ తండ్రితో మాట్లాడుతూనే ఒక్కసారిగా కిందపడిపోయాడు.
చికిత్సకు తరలించినా దక్కని ప్రాణం
కుమారుడు అకస్మాత్తుగా కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే సీపీఆర్ చేసి ఆటోలో వైరాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కళ్లెదుటే ఆడుతూ పాడుతూ తిరిగిన కుమారుడు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
‘నాన్నా.. తమ్ముడిని ఒక్కసారి చూడు’
కుమారుడి మృతదేహం వద్ద తల్లి విజయ రోదనలు అక్కడున్న వారిని కలచివేశాయి. ‘కొడుకా.. ఒక్కసారి చూడురా’ అంటూ ఆమె విలపించింది. తమ్ముడి మృతదేహం వద్దకు రావాలని తండ్రి కృష్ణను కుమార్తె పిలుస్తూ.. ‘నాన్నా.. తమ్ముడిని ఒక్కసారి చూద్దువుగానీ.. రేపటి నుంచి చూడలేవు’ అంటూ కన్నీటిపర్యంతమైంది. అయితే విగతజీవిగా పడి ఉన్న బిడ్డను చూడలేకపోతున్నానంటూ కృష్ణ దుఃఖంలో మునిగిపోయాడు. చివరకు కుటుంబ సభ్యులు ఆయనను కుమారుడి మృతదేహం వద్దకు తీసుకురావడంతో దుఃఖం కట్టలు తెంచుకుంది.
చిన్న వయసులోనే రాఘవ్ మృతిచెందడంతో గండగలపాడులో విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు రాఘవ్ మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
:::సాక్షి, వైరా(ఖమ్మం)


