మానవత్వం, క్రీడాస్ఫూర్తి లేవా?: టీమిండియా దిగ్గజం ఫైర్‌ | IND Vs WI 4th T20I, Sunil Gavaskar Slams Shamar Joseph, Questions West Indies Star Sportsmanship After Arshdeep Incident | Sakshi
Sakshi News home page

IND vs WI: నీకసలు మానవత్వం, క్రీడాస్ఫూర్తి లేవా?: టీమిండియా దిగ్గజం ఫైర్‌

Oct 15 2026 10:06 AM | Updated on Oct 15 2026 11:03 AM

IND vs WI 4th T20I Gavaskar Slams West Indies Star Questions Sportsmanship

PC: BCCI/X

టీమిండియాతో నాలుగో టీ20లో వెస్టిండీస్‌ పేసర్‌ షమార్‌ జోసెఫ్‌ వ్యవహరించిన తీరుపై భారత దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ మండిపడ్డాడు. కనీస క్రీడాస్ఫూర్తి, మానవత్వం లేదా అంటూ పర్యాటక జట్టు బౌలర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

హోప్‌ సెంచరీ
హైదరాబాద్‌లోని ఉప్పల్‌ వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 247 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.

కెప్టెన్‌ షాయీ హోప్‌ విధ్వంసకర అజేయ శతకం (50 బంతుల్లో 102), షిమ్రన్‌ హెట్‌మైర్‌ (12 బంతుల్లో 33), షెర్ఫానే రూథర్‌ఫర్డ్‌ (26 బంతుల్లో 49*) మెరుపుల వల్ల కరేబియన్‌ జట్టుకు ఈ స్కోరు సాధ్యమైంది. ఇక లక్ష్య ఛేదనలో టీమిండియాకు శుభారంభం దక్కినా దానిని కొనసాగించలేకపోయింది.

ఓపెనర్లలో సంజూ శాంసన్‌ మెరుపు అర్ధ శతకం (23 బంతుల్లో 56) బాదగా.. అభిషేక్‌ శర్మ (24 బంతుల్లో 29) నిరాశపరిచాడు. ఇక ఇషాన్‌ కిషన్‌ (6), కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (16), నమన్‌ ధిర్‌ (0) పూర్తిగా విఫలమయ్యారు.

పోరాడిన తిలక్‌ వర్మ, నితీశ్‌  రెడ్డి
మిగిలిన వారిలో లోకల్‌ బాయ్స్‌ వైస్‌ కెప్టెన్‌ తిలక్‌ వర్మ (25 బంతుల్లో 43), ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి (20 బంతుల్లో 41) కాసేపు పోరాడారు. అయితే, విండీస్‌ బౌలర్ల ధాటికి భారత్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోగా.. ఆఖరి ఓవర్లో ఒక వికెట్‌ చేతిలో ఉండగా.. విజయానికి 35 పరుగులు చేయాల్సిన పరిస్థితి.

భుజానికి తాకిన బంతి
ఇలాంటి దశలో విండీస్‌ పేసర్‌ షమార్‌ జోసెఫ్‌ బంతితో రంగంలోకి దిగగా.. టెయిలెండర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ క్రీజులో ఉన్నాడు. చివరి ఓవర్‌ తొలి బంతికే ఫోర్‌ బాదిన అర్ష్‌.. ఆ తర్వాత వైడ్‌ రాగా.. మరుసటి రెండు బంతుల్లో పరుగులు చేయలేకపోయాడు.

మూడో బంతిని షమార్‌ షార్ట్‌ బాల్‌గా సంధించగా.. అర్ష్‌ భుజానికి బలంగా తాకింది. దీంతో అతడు నొప్పితో విలవిల్లాడగా.. ఫిజియో వచ్చి పరిశీలించాడు. ఇంతలో కెప్టెన్‌ షాయీ హోప్‌ సహచర సభ్యులతో కలిసి నవ్వులు చిందించాడు. ఆ తర్వాతి బంతిని కూడా షమార్‌ అర్ష్‌ మీదకు వేశాడు. ఒకవేళ అతడు షాట్‌ మిస్‌ చేసి ఉండకపోతే మరోసారి అదే భుజానికి బంతి తాకేది.

శ్రేయస్‌ పెద్ద మనసు 
అయితే, అదృష్టవశాత్తూ అర్ష్‌ తప్పించుకోగా.. ఫోర్‌ బైస్‌, వైడ్‌ రూపంలో టీమిండియాకు ఐదు పరుగులు వచ్చాయి. కానీ ఆ తర్వాత అర్ష్‌ ఆటను కొనసాగించలేకపోయాడు. అంపైర్‌తో చర్చల తర్వాత అర్ష్‌దీప్‌ రిటైర్ట్‌ హర్ట్‌గా మైదానం వీడగా.. వెస్టిండీస్‌ గెలుపు ఖరారైంది. నిజానికి అర్ష్‌ భుజానికి బంతి తాకినపుడే కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ అతడిని వెనక్కి రమ్మంటూ డగౌట్‌ నుంచి సైగలు చేసి పెద్ద మనసు చాటుకున్నాడు.

మానవత్వం, క్రీడాస్ఫూర్తి లేవా?
అయితే, షమార్‌ జోసెఫ్‌ మాత్రం మరోసారి అర్ష్‌దీప్‌ గాయపడేలా టార్గెట్‌ చేయడాన్ని కామెంట్రీలో ఉన్న సునిల్‌ గావస్కర్‌ తప్పుబట్టాడు. ‘‘చూడండి అతడు కావాలనే అర్ష్‌దీప్‌ను లక్ష్యంగా చేసుకున్నాడు. బ్యాటర్‌పై ఇలా దాడి చేయడం ఎందుకు?’’ అని మండిపడ్డాడు. మరో మాజీ క్రికెటర్‌ శ్రీవత్స్‌ గోస్వామి కూడా షమార్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘అర్ష్‌దీప్‌ క్రీజులో ఉన్న వేళ షమార్‌ జోసెఫ్‌ చేసి క్రీడా స్ఫూర్తికి విరుద్ధం.

అర్ష్‌దీప్‌ ఆ పరిస్థితిలో టీమిండియాను గెలిపించే పరిస్థితి లేదు. అక్కడ హోరాహోరీ పోరేమీ లేదు. అయినా షమార్‌ స్టంప్స్‌ మీదకు కాకుండా కావాలనే అర్ష్‌దీప్‌ను బంతితో కొట్టాలని చేసినట్లుగా అనిపించింది’’ అని సోషల్‌ మీడియా వేదికగా విండీస్‌ పేసర్‌ తీరును విమర్శించాడు.

వెస్టిండీస్‌తో నాలుగో టీ20లో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో బుధవారం నాటి మ్యాచ్‌లో పర్యాటక జట్టు చేతిలో 24 పరుగుల తేడాతో ఓడిపోయింది.  తద్వారా విండీస్‌ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసి రేసులోకి రాగా.. బెంగళూరు టీ20తో శనివారం సిరీస్‌ ఫలితం తేలనుంది.

చదవండి: పృథ్వీ షాకు మంచి రోజులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement