పృథ్వీ షాకు మంచి రోజులు | Maharashtra Beat Services By 127 Runs In Ranji Trophy 2026 Under Prithvi Shaw Captaincy, Check Out Score Details And Highlights | Sakshi
Sakshi News home page

పృథ్వీ షాకు మంచి రోజులు

Oct 15 2026 9:00 AM | Updated on Oct 15 2026 9:50 AM

Ranji Trophy 2026: Under Prithvi Shaw Captaincy Maharashtra beat services

PC: X/Instagram

రంజీ ట్రోఫీ 2026-27 ఎలైట్‌ గ్రూప్‌ ‘సి’లో భాగంగా ఢిల్లీ వేదికగా సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర జట్టు 127 పరుగుల తేడాతో గెలుపొందింది. ఓవర్‌నైట్‌ స్కోరు 66/5తో బుధవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన మహారాష్ట్ర చివరకు 56 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. అంకిత్‌ బావ్నే (48; 3 ఫోర్లు), రాజ్‌వర్ధన్‌ హంగార్గేకర్‌ (43; 5 సిక్స్‌లు)రాణించారు. 

విక్కీ మాయాజాలం
సర్వీసెస్‌ బౌలర్లలో అర్జున్‌ శర్మ 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 248 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సర్వీసెస్‌ 63.3 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. నకుల్‌ శర్మ (36) టాప్‌ స్కోరర్‌. మహారాష్ట్ర స్పిన్నర్‌ విక్కీ ఓస్త్‌వాల్‌ 5 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. 

అంతకుముందు మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 333 పరుగులు చేయగా... సర్వీసెస్‌ 227 పరుగులు చేసింది. మహారాష్ట్ర ప్లేయర్‌ అంకిత్‌ బావ్నేకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

పృథ్వీ షాకు మంచి రోజులు
క్రమశిక్షణారాహిత్యం వల్ల సొంత జట్టు ముంబైకి దూరమైన పృథ్వీ షా.. మహారాష్ట్ర టీమ్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఇక మహారాష్ట్ర రెగ్యులర్‌ కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌.. ఆస్ట్రేలియాతో అనధికారిక వన్డే సిరీస్‌లో భారత్‌- ‘ఎ’కు సారథిగా వ్యవహరించిన కారణంగా సర్వీసెస్‌తో మ్యాచ్‌కు దూరమయ్యాడు.

ఈ నేపథ్యంలో పృథ్వీ షా ఈ మ్యాచ్‌లో మహారాష్ట్ర తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. తొలి మ్యాచ్‌లోనే సారథిగా ఘన విజయం అందుకున్నాడు. ఇదిలా ఉంటే.. సర్వీసెస్‌తో మ్యాచ్‌ మధ్యలోనే పృథ్వీ షాకు వ్యక్తిగతంగానూ శుభవార్త అందింది.

మా బంధం కొనసాగుతుంది
పృథ్వీ షాతో తన నిశ్చితార్థాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన మోడల్‌, నటి ఆకృతి అగర్వాల్‌.. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. చెప్పుడు మాటలు విని పృథ్వీని తప్పుగా అర్థం చేసుకున్నానని.. తమ బంధాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. 

ఇందుకు సమ్మతిస్తూ పృథ్వీ షా ఆమె సోషల్‌ మీడియా పోస్టును రీషేర్‌ చేశాడు. ఈ నేపథ్యంలో ఈ మహారాష్ట్ర ఆటగాడికి మంచి రోజులు వచ్చాయంటూ అభిమానులు ఉద్వేగానికి లోనవుతున్నారు.   కాగా సర్వీసెస్‌తో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో అర్ధ శతకం (70) బాదిన పృథ్వీ షా.. రెండో ఇన్నింగ్స్‌ (7)లో మాత్రం విఫలమయ్యాడు.
  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement