సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్ సంచలన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-1 తేడాతో ఇంగ్లండ్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ పేసర్లు స్పెన్సర్ జాన్సన్, రిలే మెరెడిత్ ధాటికి కేవలం 4.2 ఓవర్లలోనే 32 పరుగులకు 4 కీలక వికెట్లు కోల్పోయింది.
కష్టాల్లో ఉన్న జట్టును ఆల్‌రౌండర్ సామ్ కరన్ (28 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) తన మెరుపు అర్ధశతకంతో ఆదుకున్నాడు. అతడికి జేమ్స్ కోల్స్ (33), జేమీ ఓవర్టన్ (20) సహకరించడంతో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగుల పోరాడే స్కోరు సాధించింది. ఆసీస్ బౌలర్లలో స్పెన్సర్ జాన్సన్, రిలే మెరెడిత్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
మార్ష్ సెంచరీ వృథా..
అనంతరం 182 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ తొలి ఓవర్‌లోనే పెవిలియన్‌కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సామ్ హార్పర్(18)తో కలిసి మిచెల్ మార్ష్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ 26 బంతుల్లోనే 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.
ఆసీస్ 6 ఓవర్లలో 67/1 వద్ద నిలిచింది. ఆ తర్వాత ఇంగ్లండ్ బౌలర్లు పుంజుకుని ఆసీస్ ఇన్నింగ్స్‌ను దెబ్బతీశారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా దూకుడుగా ఆడిన మార్ష్, 49 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
17.1 ఓవర్లలో ఆసీస్ 150 పరుగుల మార్కును దాటినా.. చివరి ఓవర్లలో ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఆఖరి ఓవర్‌లో ఆసీస్ విజయానికి 12 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి.
క్రీజులో మార్ష్ ఉండడంతో ఆసీస్ గెలుస్తుందని అంతా భావించారు. కానీ ఆ ఓవర్ వేసిన హెన్రీ థామస్ క్రోకోంబ్ కీలకమైన మార్ష్ వికెట్‌తో పాటు.. తొలి బంతికే జోయెల్ డేవిస్‌ను పెవిలియన్ చేర్చాడు. దీంతో ఆసీస్ ఓటమి పాలైంది.


