న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత వికెట్ కీపర్-బ్యాటర్ ధ్రువ్ జురెల్ అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను ఫాలోఆన్ గండం నుంచి గట్టెక్కించాడు. ఓ వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటికీ జురెల్ మాత్రం ఎంతో జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.
170 బంతులు ఎదుర్కొన్న ఈ రాజస్థాన్ బ్యాటర్ 88 పరుగులు చేసి ఔటయ్యాడు. జురెల్ ఆడిన కీలక ఇన్నింగ్స్‌పై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా జురెల్ ఏమాత్రం ఒత్తిడికి లోనవకుండా ఆడాడని ఆయన కొనియాడారు.
సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ మాట్లాడుతూ.. "ధ్రువ్ జురెల్ ఆడిన షాట్ల కంటే, ఒత్తిడిని తట్టుకుని అతడు చేసిన పోరాటం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. గతంలో రాంచీ టెస్టులోనూ అతను ఇదే తరహా ఇన్నింగ్స్ ఆడాడు. ఆటగాడిలో టెక్నిక్ కంటే మానసిక దృఢత్వానికే నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను.
కఠిన పరిస్థితుల్లో నిలబడే తత్వమే అతడికి ప్రత్యేక ఆటగాడిగా గుర్తింపు తెచ్చింది" అని పేర్కొన్నారు. కాగా న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 356 పరుగుల భారీ స్కోర్ సాధించగా.. భారత్ 246 రన్స్‌కే ఆలౌటైంది.
చదవండి: ENG vs AUS: ఇంగ్లండ్ బ్యాటర్ల చెత్త రికార్డు.. టీ20 చరిత్రలో తొలిసారి


