source: X
టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు చేదు అనుభవం ఎదురైంది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో అతడు, కెరీర్ మొత్తంలోనే అత్యంత సుదీర్ఘ వికెట్ కరువును చవిచూశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 26 ఓవర్లు బౌలింగ్ చేసినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన బుమ్రా.. రెండో ఇన్నింగ్స్‌లో టామ్ లాథమ్ వికెట్‌తో ఊపిరి పీల్చుకున్నాడు. తద్వారా 292 బంతుల వికెట్ కరువకు తెరదించాడు.
న్యూజిలాండ్‌తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో చివరిసారిగా వికెట్ తీసిన బుమ్రా.. ఆ తర్వాత వరుసగా 291 బంతులు బౌలింగ్ చేసినా మరో వికెట్ దక్కించుకోలేకపోయాడు. బుమ్రా టెస్టు కెరీర్‌లో రెండు వికెట్ల మధ్య నమోదైన అత్యంత సుదీర్ఘ విరామం ఇదే. 2021లో 4 టెస్ట్‌ల వ్యవధిలో 285 బంతుల పాటు వికెట్ తీయలేకపోయిన బుమ్రా, న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌లో ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. 292 ముందు బుమ్రా తీసిన వికెట్ కూడా టామ్ లాథమ్‌దే.
ఇదిలా ఉంటే, భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ పైచేయి సాధించినప్పటికీ.. భారత్ కూడా పోరాటపటిమ ప్రదర్శిస్తుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసి, 243 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌటైంది. 117 పరుగులకే 7 వికెట్లు కోల్పోయినా దృవ్ జురెల్ (88), ఆకాశ్ దీప్ (29), గుర్నూర్ బ్రార్ (10) అనూహ్య పోరాటపటిమ కనబర్చి గౌరవప్రదమైన స్కోర్ అందించారు. దీనికి ముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 356 పరుగులకు ఆలౌటైంది.
ఇదీ చదవండి: ఆకాశ్ దీప్‌పై జేమీసన్ ఘాటు వ్యాఖ్యలు


