Photo Credit: BCCI Twitter
క్రైస్ట్‌చర్చ్‌లోని హెగ్లీ ఓవల్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన కెరీర్లో మరో ప్రధాన మైలురాయిని సాధించాడు. మూడో రోజు ఆటలో భాగంగా న్యూజిలాండ్ రెండవ ఇన్నింగ్స్‌లో హెన్రీ నికోల్స్‌ను ఔట్ చేయడం ద్వారా 32 ఏళ్ల బుమ్రా అరుదైన ఫీట్ సాధించాడు.
అదేంటంటే, విదేశీ మ్యాచ్‌ల్లో అత్యధిక అంతర్జాతీయ వికెట్లు తీసిన భారత బౌలర్ల ఆల్‌టైమ్ జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో బుమ్రా భారత దిగ్గజ బౌలర్ జవగళ్ శ్రీనాథ్‌ను అధిగమించడం విశేషం. హెన్రీ నికోల్స్ వికెట్ తీయడం ద్వారా బుమ్రా అంతర్జాతీయ విదేశీ వికెట్ల సంఖ్య 341కి చేరింది. దీంతో, 340 వికెట్లతో తన కెరీర్‌ను ముగించిన శ్రీనాథ్‌ను బుమ్రా అధిగమించాడు.
ఇక విదేశాల్లో భారత్ తరఫున అత్యధిక అంతర్జాతీయ వికెట్లు తీసిన బౌలర్‌గా దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తొలి స్థానంలో ఉన్నాడు. కుంబ్లే 248 మ్యాచ్‌ల్లో 477 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, జహీర్ ఖాన్ 199 మ్యాచ్‌ల్లో 398 వికెట్లతో రెండో స్థానంలో, కపిల్ దేవ్ 206 మ్యాచ్‌ల్లో 368 వికెట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు.
ఆ తర్వాత బుమ్రా 142 మ్యాచ్‌ల్లో 341 వికెట్లతో నాలుగో స్థానంలో, ఐదో స్థానంలో జవగళ్ శ్రీనాథ్ 184 మ్యాచ్‌ల్లో 340 వికెట్లతో ఉన్నారు. వీరి తర్వాత హర్భజన్ (331 వికెట్లు), ఇషాంత్ శర్మ (296 వికెట్లు), షమీ (294 వికెట్లు), అశ్విన్ (290 వికెట్లు), జడేజా (254 వికెట్లు) వరుసగా కొనసాగుతున్నారు. ఇక బుమ్రా 53 టెస్టు మ్యాచ్‌ల్లో 2.76 ఎకానమీ రేటుతో 239 వికెట్లు పడగొట్టాడు.
ఇదీ చదవండి: టీమిండియాతో టెస్టు.. చరిత్ర సృష్టించిన కివీస్ బౌలర్


