source: X
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టీ20లో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ మెరుపు బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి సుడిగాలి అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. కేవలం 28 బంతుల్లోనే 50 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.
ఈ ప్రదర్శనతో సామ్ కర్రన్ అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లండ్ తరఫున ఏడు లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్‌కు వచ్చి 50 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో రవి బొపారా (65 నాటౌట్), విల్ జాక్స్ (53 నాటౌట్) మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. పవర్‌ప్లే ముగిసేలోపే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఫిల్ సాల్ట్, అన్యూరిన్ డొనాల్డ్, హ్యారీ బ్రూక్, టామ్ బాంటన్ సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరారు.
ఈ దశలో జోర్డన్ కాక్స్, జేమ్స్ కోల్స్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 44 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ దశలో క్రీజ్‌లోకి వచ్చిన కర్రన్.. లియామ్ డాసన్, జేమీ ఓవర్టన్ సాయంతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఈ ముగ్గురు కలిసి చివరి మూడు ఓవర్లలో ఏకంగా 51 పరుగులు సాధించారు.
మార్ష్ మెరుపులు
182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్ మిచెల్ మార్ష్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. మరో ఓపెనర్ జేక్ ఫ్రేజర్ డకౌటైనప్పటికీ.. సామ్ హార్పర్ (18), నిఖిల్ చౌదరి (12), టిమ్ డేవిడ్ (12) సాయంతో తన జట్టును లక్ష్యం దిశగా తీసుకెళ్తున్నాడు. 12.5 ఓవర్లు ముగిసే సమయానికి ఆసీస్ స్కోర్ 111-4గా ఉంది. మార్ష్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 67 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. అతడికి జతగా లచ్లాన్ షా క్రీజ్‌లో ఉన్నాడు.
ఇదీ చదవండి: ఇంగ్లండ్ బ్యాటర్ల చెత్త రికార్డు.. టీ20 చరిత్రలో తొలిసారి


