PC: BCCI/X
ఉప్పల్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన నాలుగో టీ20లో 24 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. విండీస్ నిర్దేశించిన 248 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు పోరాడినప్పటికీ విజయాన్ని అందుకోలేకపోయారు. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ ప్రస్తుతం 2-2తో సమమైంది. శనివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న ఆఖరి మ్యాచ్ సిరీస్ విజేతను నిర్ణయించనుంది.
టీమిండియాకు భారీ షాక్!
అయితే ఈ కీలక మ్యాచ్కు ముందు భారత్కు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశముంది. స్టార్ ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ గాయం కారణంగా బెంగళూరు టీ20కి దూరమయ్యే ఛాన్స్ ఉంది. నాలుగో టీ20లో బ్యాటింగ్ చేస్తుండగా అర్ష్దీప్ సింగ్ భుజానికి గాయమైంది. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో షమర్ జోసఫ్ వేసిన వేగవంతమైన బౌన్సర్ అర్ష్దీప్ భుజానికి బలంగా తాకింది. దీంతో అతడు తీవ్రమైన నొప్పితో విలవిల్లాడాడు.
వెంటనే ఫిజియో మైదానానికి వచ్చి చికిత్స అందించినప్పటికీ అతడి నొప్పి తగ్గలేదు. దీంతో అతడు ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు. ఈ గాయం తీవ్రతపై బీసీసీఐ లేదా టీమ్ మేనేజ్మెంట్ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.
కానీ అర్ష్దీప్ పరిస్థితి చూస్తుంటే గాయం తీవ్రమైనదిగా తెలుస్తోంది. ఈ క్రమంలో బెంగళూరులో జరగనున్న నిర్ణయాత్మక చివరి టీ20కి అర్ష్దీప్ అందుబాటుపై సందిగ్ధం నెలకొంది.
చదవండి: IND vs WI: అభిషేక్ శర్మ ప్రపంచ రికార్డు


