12 ఏళ్లుగా ఏం చేస్తున్నారు? | Telangana High Court declines relief to 2 doctors in Tg-AP medical cadre row | Sakshi
Sakshi News home page

12 ఏళ్లుగా ఏం చేస్తున్నారు?

Oct 17 2026 6:04 AM | Updated on Oct 17 2026 6:04 AM

Telangana High Court declines relief to 2 doctors in Tg-AP medical cadre row

కేడర్‌ కేటాయింపు వివాదంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై హైకోర్టు అసహనం

సుప్రీంకోర్టులోనే అభ్యంతరాలు చెప్పుకోవాలని పిటిషనర్ల ఆదేశం 

‘స్టేటస్‌కో’..మధ్యంతర ఉత్తర్వుల పొడిగింపునకు నిరాకరణ 

29లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులకు స్పష్టం 

లేనిపక్షంలో రూ.25 వేల చొప్పున జరిమానా విధిస్తామని హెచ్చరిక

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ, ఏపీ మధ్య వైద్య ఉద్యోగుల కేడర్‌ కేటాయింపు వివాదంలో డాక్టర్‌ ఐ.శ్రీలక్ష్మీ, డాక్టర్‌ రత్నం ఆండాళ్‌ దాఖలు చేసిన పిటిషన్లపై ‘స్టేటస్‌కో’మధ్యంతర ఉత్తర్వులను పొడిగించేందుకు హైకోర్టు నిరాకరించింది. కేడర్‌ కేటాయింపు ప్రధాన పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున, పిటిషనర్లకు ఏవైనా అభ్యంతరాలుంటే అక్కడే పరిష్కరించుకోవాలని స్పష్టం చేసింది. తాజా పిటిషన్లలో ప్రతివాదులు ఈ నెల 29లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. గడువులోగా కౌంటర్లు దాఖలు చేయకపోతే రోజుకు రూ.25 వేల చొప్పున జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

 రాష్ట్ర విభజన నేపథ్యంలో వైద్య విద్యాశాఖ ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2016, జనవరి 25న జారీ చేసిన తాత్కాలిక కేటాయింపు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. 2016లో దాఖలు చేసిన పిటిషన్లపై తొలుత డివిజన్‌ బెంచ్‌ మధ్యంతర స్టే ఇచి్చంది. 2022లో ఆ రిట్‌ పిటిషన్లను కొట్టివేయడంతో పలువురు ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్లు సుప్రీంకోర్టులో విచారణలో ఉండగానే.. గతనెల పిటిషనర్లకు రిలీవ్‌ ఆర్డర్లు జారీ చేశారు. 

హనుమకొండ జీఎంహెచ్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తూ, ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని గాంధీ మెడికల్‌ కాలేజీలో డిప్యుటేషన్‌పై ఉన్న తనను ఆంధ్రప్రదేశ్‌కు రిలీవ్‌ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ప్రొఫెసర్‌ రత్నం ఆండాళ్, మహేశ్వరం ప్రభుత్వ వైద్య కళాశాలలో పాథాలజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న తనను రిలీవ్‌ చేయడంపై ప్రొఫెసర్‌ డాక్టర్‌ శ్రీలక్ష్మి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. తొలుత విచారణ చేపట్టిన ధర్మాసనం.. రిలీవ్‌ ఉత్తర్వులపై స్టేటస్‌ కో విధించింది. ఈ పిటిషన్లపై జస్టిస్‌ కె.లక్ష్మణ్, జస్టిస్‌ సుజన కళాసికం ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది.  

మధ్యంతర ఉత్తర్వులు పొడిగించలేం  
ఉదయం విచారణ సందర్భంగా కేడర్‌ కేటాయింపు వివాదంలో రాష్ట్ర అధికారుల తీరుపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిని పరిగణనలోకి తీసుకోకుండా ఉద్యోగులను మరో రాష్ట్రానికి వెళ్లాలని ఎలా ఆదేశిస్తారని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు 2025 ఏప్రిల్‌ 24న ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం తెలంగాణ ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించేందుకు పిటిషనర్లకు వెసులుబా టు కల్పించిందని గుర్తుచేసింది. 

ఆ వినతులపై ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంది? ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకు ఎప్పుడు తెలియజేసింది? అనే వివరాలను మధ్యాహ్నం 2.15 గంటలకు సమర్పించాలని ఆదేశించింది. పూర్తి వివరాలు సమర్పించకపోతే సాయంత్రం 4.15 గంటలకు వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించింది. అవసరమైతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హాజరును కూడా ఆదేశిస్తామని తెలిపింది.

 మధ్యాహ్నం న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం.. ప్రధాన వివాదం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున ప్రస్తుత రిట్‌ పిటిషన్లలో స్టేటస్‌కో ఇస్తూ మరో ధర్మాసనం ఇచి్చన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించేందుకు తాము మొగ్గు చూపడం లేదని స్పష్టం చేసింది. పిటిషనర్లు తమ అభ్యంతరాలను సుప్రీంకోర్టులోనే వినిపించాలని పేర్కొంటూ తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement