హైదరాబాద్: అపార్ట్మెంట్లో ఓ మహిళ పెంచుకుంటున్న కుక్క దాడి చేయడంతో తాత, మనవడు తీవ్ర గాయాల పాలయ్యారు. బాధితులు, అపార్ట్మెంట్ వాసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాచారం స్నేహపురి కాలనీలోని సూర్యటవర్స్ ‘ఎ’ బ్లాక్ పెంట్హౌస్లో ఆశ అనే మహిళ ఉంటున్నారు. ఆమె రోట్వీలర్ జాతి పెంపుడు కుక్కను పెంచుకుంటున్నారు. ఇదే అపార్ట్మెంట్లో ఎదురుగా ‘బి’ బ్లాక్లో నివాసం ఉండే 78 ఏళ్ల వృద్ధుడు వాసుదేవరావును, ఆయన మనవడు ఏడేళ్ల ధృవను గురువారం లిఫ్ట్ వద్ద ఆశ పెంపుడు శునకం రెచ్చిపోయి కరవడంతో వారి కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి.
భారీగా రక్తస్రావమైంది. విషయాన్ని కుక్క యజమానురాలు ఆశకు చెప్పగా.. ఎవరికి చెప్పుకొంటారో చెప్పుకోండి అంటూ బెదిరిస్తోందని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ప్రమాదకరంగా మారిన పెంపుడు కుక్కను పంపించి వేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం అపార్ట్మెంట్ వాసులు బాధితులతో కలిసి ఆందోళనకు దిగారు. అనంతరం నాచారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అపార్ట్మెంట్ వాసులు రత్నాకర్, ప్రవీణ్, విజయ రాఘవన్, శ్రీనివాస్ తెలిపారు.


