● బతుకమ్మ పూలల్లో ఎన్నో ఔషధగుణాలు ● పండుగ వెనుక పరమార్ధం కూడా..
ఖమ్మంగాంధీచౌక్: బతుకమ్మ అంటేనే పూల పండగ. రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ సందర్భంగా రంగురంగుల పూలతో ఆడపడుచులు త్రికోణాకారంలో బతుకమ్మలు పేర్చడం ఆనవాయితీగా వస్తోంది. వర్షాకాలం చివరలో, శీతాకాలం ఆరంభంలో జలాశయాలు నిండి, మొక్కలు రంగురంగుల పూలతో కళ సంతరించుకుంటాయి. ఈ నేపథ్యాన బతుకమ్మ పేర్చేందుకు వాడే ప్రతీ పువ్వులో అందమే కాక ఆరోగ్యాన్ని ఇచ్చే ఔషధగుణాలు కూడా ఇమిడి ఉంటాయి.
బతుకమ్మ పేర్చడంలో ముందు వరుసలో తంగేడు పూలు ఉంటాయి. పసిడి వర్ణంలో మెరిసే ఈ పూవు తెలంగాణ రాష్ట్ర పుష్పం కూడా. ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. జ్వరం, మలబద్ధకానికి ఇది మంచి మందు. తంగేడు పూలను ఆరబెట్టి, దానిలో ఉసిరికాయ పొడి, పసుపు సమాన భాగాలుగా కలిపి చేసిన మందును ప్రతిరోజూ రెండు పూటలా తినడానికి అరగంట ముందు గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది.
అందం, స్వచ్ఛతకు ప్రతీక అయిన తామర పూవును రక్తస్రావ నివారణకు వినియోగిస్తారు. సుగంధ ద్రవ్యాల తయారీలో కూడా వాడతారు. నిద్రలేమి, బద్ధకంతో బాధపడేవారికి తామర తైలం దివ్య ఔషధం. తామర రేకుల పొడిని తేనెలో కలిపి ముఖానికి రాసుకుంటే చర్మ సౌందర్యం పెరుగుతుంది, మొటిమలు తగ్గుతాయి.
గునుగు (కొన్ని చోట్ల గునుకు, బొంగు పువ్వు) అనేది గడ్డి జాతి మొక్క. బతుకమ్మ అలంకరణలో ఇది ఎంతో శోభనిస్తుంది. విరేచనాలు, అతిసారం నివారణకు మందుగా వాడతారు. ఈ పువ్వు చర్మంపై గాయాలు, పొక్కులు, క్షయ వ్యాధి నివారణకు కూడా ఉపయోగపడుతుంది.
బంతి, చామంతి కంటి చూపును మెరుగుపరచడానికి, చర్మ వ్యాధుల నివారణకు తోడ్పడతాయి. వీటి వాసన క్రిమి కీటకాలను దూరం చేస్తుంది. నందివర్ధనం కంటి వ్యాధులకు, జ్వరానికి మంచి మందు. గోరింటాకు పూలు బతుకమ్మ మధ్యలో పెట్టే పూలు, ఆకులు శరీరానికి చలువ చేస్తాయి. సీతమ్మ జడల పూలు రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంది.
బతుకమ్మను పేర్చి ఆడేటప్పుడు, పూలలోని ఔషధ గుణాలు గాలిలో కలిసి శ్వాస ద్వారా శరీరంలోకి చేరి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వర్షాకాలం తర్వాత వచ్చే వైరల్ జ్వరాలను తట్టుకునేలా చేస్తాయి. పూలు పేర్చడం, బతుకమ్మ ఆటపాటలతో మహిళలకు మంచి వ్యాయామం కూడా అవుతుంది. అందుకే బతుకమ్మ కేవలం పూల పండుగే కాదు ప్రకృతిని ఆరాధిస్తూ, ఆరోగ్యాన్ని కాపాడుకునే సంప్రదాయ వైద్య పండగ అని చెబుతారు.
గునుగు
పువ్వు


