తిరుమలాయపాలెం/తల్లాడ: విద్యుత్ అంతరాయాలకు తోడు సాగునీరు అందక పంటలు ఎండిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై ‘సాక్షి’లో శుక్రవారం ‘ఎండుతున్న పంటలు’ శీర్షికన ప్రచురితమైన కథనంతో విద్యుత్, వ్యవసాయ శాఖల అధికారులు స్పందించారు. తిరుమలాయపాలెం మండలం బంధంపల్లిలో ఎండుతున్న వరి పంటను విద్యుత్ శాఖ కూసుమంచి ఏడీఈ వెంకట్ పరిశీలించి రైతు రేగళ్ల సుదర్శన్‌రెడ్డి నుంచి వివరాలు సేకరించారు. అయితే, రైతు ఎక్కువ విస్తీర్ణంలో వరి సాగు చేస్తూ, అందుకు సరిపడా మోటార్ల ద్వారా నీరు అందించకపోవడం, మోటార్ల ట్రాన్స్ఫార్మర్పై పడినట్లు గుర్తించారు. మోటార్‌ను మెకానిక్కు చూపించాక సమస్య బయటపడడంతో శుక్రవారం కొత్త మోటారు అమర్చాడని తెలిపారు. అయితే, లో ఓల్టేజీ సమస్య ఉన్న చోట అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడమే కాక సాధారణ సరఫరాకు అదనంగా మరో రెండు గంటల పాటు విద్యుత్ అందిస్తున్నామని ఏడీఈ తెలిపారు. ఇక తల్లాడ మండలం బస్వాపురంలో ఎన్నెస్పీ మేజర్‌కు నీటి సరఫరా నిలిపివేయగా ఎండుతున్న పంటలను మండల వ్యవసాయాధికారి ఎండీ.తాజుద్దీన్, ఏఈఓ నాగరాజు పరిశీలించారు. బస్వాపురం మేజర్ ఆయకట్టులో సాగైన వరి, ప్రస్తుతం పరిస్థితిపై ఆరా తీశారు. ఎన్నెస్పీ ఉద్యోగులు కూడా పొలాలను పరిశీలించారు.


