మధిర: నల్లగొండలో జరిగిన పీఆర్టీయూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మధిర మండలం నిధానపురం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు, యూనియన్ సీనియర్ సభ్యుడైన తూమాటి కృష్ణారెడ్డి పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయనను పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రంగారావు, అసోసియేట్ అధ్యక్షుడు ఆర్ బ్రహ్మారెడ్డి, ఉపాధ్యక్షులు కొమ్ము శ్రీనివాసరావు అభినందించారు. అలాగే, నాయకులు కొలగాని ప్రసాదరావు, బూసా కోటేశ్వరరావు, రవికుమార్, పిల్లి నరసింహారావు, పురం సంగారావు, చిలుకూరు సత్యనారాయణరెడ్డి, పోలె సుధాకర్, శాంతబాబు, జమీర్, నాగేశ్వరరావు,తెల్ల మేకల శ్రీనివాసరావు, చెడే సతీష్, మల్లెల శ్రీనివాస్, శ్యామలరావు, అజయ్ కుమార్, రాజు, నరసింహాచారి, కేశవులు, కోటేశ్వరరావు, జ్యోతి, అనసూయ, లలిత కుమారి, తదితరులు కూడా కృష్ణారెడ్డికి అభినందనలు తెలిపారు.
బాణాసంచా షాప్ల ఏర్పాటుకు దరఖాస్తులు
ఖమ్మంక్రైం: దీపావళి సందర్భంగా బాణాసంచా విక్రయ దుకాణాలు ఏర్పాటు చేయాలనుకునే వారు తాత్కాలిక లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకోవాలని సీపీ సునీల్దత్ సూచించారు. ఈనెల 17నుంచి 24 వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అగ్నిమాపక అధికారి నుంచి ఎన్ఓసీ, ప్రభుత్వ భూమిలో షాప్ ఏర్పాటుచేస్తే సంబంధిత మున్సిపల్, గ్రామపంచాయతీ నుంచి అనుమతి పత్రం, ప్రైవేట్ స్థలమైతే యజమాని నుంచి ఎన్ఓసీ లేదా ఒప్పంద పత్రం, లైసెన్స్ ఫీజు రూ.1,500 చెల్లించిన రశీదు, ఇతర పత్రాలను దరఖాస్తుకు జత చేసి సమర్పించాలని పేర్కొన్నారు.
కమిటీల నిర్మాణం పూర్తి
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలోని మండల, పట్టణ కమిటీల ఏర్పాటు పూర్తిచేశామని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ తెలిపారు. హైదరాబాద్ గాంధీభవన్లో శుక్రవారం సమావేశంలో సత్యనారాయణ పాల్గొన్నారు. జిల్లాలో మండల, పట్టణ కమిటీలను ఎమ్మెల్యేల సహకారంతో పూర్తిచేశామని తెలిపారు. త్వరలోనే గ్రామ, డివిజన్, బూత్ కమిటీలను పూర్తి చేస్తామని వెల్లడించారు.
సర్టిఫికెట్ అవకతవకలపై కేసు
మధిర: ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్(ఎఫ్ఎంసీ) సంబంధించి అవకతవకలు జరిగాయని ఎన్వీఎస్.ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదుతో శుక్రవారం ఏడుగురిపై కేసు నమోదైంది. జిలుగుమూడుకు చెందిన నల్లగట్ల సీతారామయ్య మృతి తర్వాత ఫోర్జరీ సంతకంతో నల్లగట్ల సాయి ప్రణీత్ ఎఫ్ఎంసీ కోసం దరఖాస్తు చేశాడు. అయితే, తన సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు ఎన్వీఎస్.ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదుతో అందుకు సహకరించిన ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ డి.రమేష్ తెలిపారు. అలాగే, కలెక్టర్ ఆదేశాల మేరకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ను రద్దు చేసినట్లు తహసీల్దార్ ఆర్.రాంబాబు తెలిపారు. ఈ వ్యవహారంపై ‘సాక్షి’లో కథనాలు ప్రచురితమైన విషయం విదితమే.


