కల్లూరు రూరల్: కల్లూరు ఎంపీడీఓ కార్యాలయంలో టేకుచెట్లను ఇటీవల నరికివేయించగా ఇద్దరిపై కేసు నమోదైంది. ఇది మరువకముందే మండలంలోని ముచ్చవరం హెల్త్ సెంటర్ ప్రాంగణంలోని ఆరు టేకుచెట్లను నరికించడం బయటపడింది. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలోనే శుక్రవారం నరికివేయించినట్లు చెబుతుండగా, అనుమతి లేదని కొందరు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సురేష్ ఆధ్వర్యాన ఉద్యోఉగలు విచారణ చేపట్టారు. ఈ విషయమై ఉపసర్పంచి వైకుంఠ శ్రీనివాసరావు మాట్లాడుతూ హెల్త్ సెంటర్ చుట్టూ ఉన్న టేకు చెట్లతో ఇబ్బంది పడుతున్నట్లు ఉద్యోగులు వినతిపత్రం ఇవ్వగా, పాలకవర్గం తీర్మానంతో తమ సిబ్బందితో నరికివేయించామని తెలిపారు. కలప కూడా జీపీ కార్యాలయం వద్దే నిల్వ చేశామని వెల్లడించారు.


