టైటిల్: జైలర్ 2
నటీనటులు: రజనీకాంత్, ఎ.జే. సూర్య, మిథున్ చక్రవర్తి, రమ్యకృష్ణ, విద్యాబాలన్, మోహన్ లాల్, హృతిక్ రోషన్, శివరాజ్ కుమార్, సూరజ్ వెంజరమూడు, హకీమ్ షాజహాన్, యోగిబాబు తదితరులు
నిర్మాణ సంస్థ: సన్ పిక్చర్స్
నిర్మాత: కళానిధి మారన్
దర్శకత్వం: నెల్సన్ దిలీప్ కుమార్
సంగీతం: అనిరుధ్ రవిచందర్
విడుదల తేది: అక్టోబర్ 15, 2026

కథేంటంటే..
విగ్రహాల అక్రమ వ్యాపారం చేస్తున్న వర్మ(వినాయకన్)ని, అతనితో చేతులు కలిపిన కొడుకు ఏసీపీ అర్జున్(వసంత్ రవి) ని రిటైర్డ్ జైలర్ ముత్తువేల్ పాండ్యన్ (రజనీకాంత్) తుది ముట్టించడంతో ‘జైలర్’ సినిమా ముగుస్తుంది. జైలర్ 2 కథ అక్కడ నుంచి ప్రారంభం అవుతుంది. తన కొడుకు చావుకు కారణం అయిన వర్మ వెనుక ఉన్న బాస్ ఎవరో తెలుసుకోవాలని ముత్తువేల్ పాండ్యన్ ప్రయత్నిస్తుంటాడు. ఇందులో భాగంగానే లోకల్ రౌడీ మూర్తి దగ్గర డ్రైవర్‌గా చేరి.. అతని ద్వారా దిలీప్ (సురాజ్ వెంజారమూడు)ని కలుస్తాడు. దిలీప్ ద్వారా వర్మ బాస్ బోధి (ఎస్.జె. సూర్య) గురించి తెలుసుకోవాలనుకుంటాడు. మరి ఆ ప్రయత్నం ఫలించిందా? బోధి అక్రమ వ్యాపారాలను మత్తువేల్ పాండ్యన్ ఎలా కూల్చాడు? ఈ క్రమంలో తన స్నేహితులు మాథ్యూ(మోహన్ లాల్), నరసింహా(శివరాజ్ కుమార్), రోలీ(హృతిక్ రోషన్), కామదేవ్(జాకీ ష్రాప్) ఎలాంటి సహాయం చేశారు? ఈ కథలో చక్రి కల్పక్ (మిథున్ చక్రవర్తి), కాంత కల్పక్(విద్యాబాలన్) పాత్రలు ఏమిటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..
జైలర్ సినిమా అంత పెద్ద హిట్ కావడానికి కారణం.. దిలీప్ కుమార్ అల్లుకున్న కథ, కథనం అని చెప్పాలి. రజనీకాంత్‌ని తెరపై అలా పెట్టి కథను ముందుకు నడిపించాడు. ఆయనతో యాక్షన్ చేయించకుండానే యాక్షన్ సినిమా చూపించాడు. ఆయనకున్న ఇమేజ్‌కి తగ్గట్లుగా ఎలివేషన్ సీన్లను రాసుకున్నాడు. పార్ట్ 2కి కూడా దిలీప్ కుమార్ ఆపనే చేశాడు. రజనీకాంత్‌ని అలా తెరపై పెట్టి తనదైన స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్ చేశాడు.
(చదవండి: ఐటమ్ సాంగ్‌లో శృతిహాసన్.. ఏ సినిమానో తెలుసా?)
సినిమాలో యాక్షన్ సీన్లు ఉంటాయి కానీ రజనీకాంత్ చేయడు. అలా నిలబడి..విలన్లుకు చమటలు పట్టిస్తాడు. సరైన సమయానికి క్యామియోలను దించి.. ఎక్కడా బోర్ కొట్టించకుండా కథనాన్ని నడిపించాడు. కథగా చూస్తే ఇందులో కొత్తదనం ఉండదు. ఇంకా చెప్పాలంటే జైలర్ సినిమాలాగే ఉంటుంది. అయితే స్క్రీన్‌ప్లే మాత్రం అదిరిపోతుంది. మోహన్‌లాల్, శివరాజ్ కుమార్, హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరోలను కథకు అవసరం అయిన చోట చక్కగా వాడుకున్నాడు.
ఫస్టాఫ్‌లో అసలు కథే ఉండదు. కానీ ఎక్కడ బోర్ కొట్టడు. ఒకవైపు యోగిబాబు కామెడీతో పాటు మరోవైపు మూర్తి పాత్ర చేసే అతి నవ్వులు పూయిస్తుంది. చిన్న చిన్న ట్విస్టులతో మొదటి భాగం ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. అయితే అసలు విలన్ మాత్రం ఇంటర్వెల్ ముందు వరకు ఎంట్రీ ఇవ్వడు. ఇక విలన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథనం పరుగులు పెడుతుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తి పెంచుతుంది.
ద్వితియార్థం మొత్తం ఎస్.జే సూర్య, రజనీకాంత్ పాత్రల చుట్టూనే తిరుగుతుంది. అయితే ప్రతిసారి హీరో మనుషులను విలన్ బంధించడం.. వారిని విడిపించేందుకు విలన్ మనుషులను హీరో బంధించడం ఇలానే సాగుతుంది. ఈ క్రమంలో కొన్ని సీన్లు కొంత సాగదీతగా అనిపిస్తుంది. విద్యాబాలన్, రజనీకాంత్ పాత్రల మధ్య జరిగే ఇగో సంభాషణలు, సీన్లు ఆకట్టుకుంటాయి. కొన్ని చోట్లు నవ్వులు పూయిస్తాయి కూడా.
కామియోల్లో హృతిక్ రోషన్‌ని గట్టిగా వాడుకున్నారు. మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ పాత్రల్నీ సరిగా వాడుకోలేదు. క్లైమాక్స్ సింపుల్‌గా ముగిసినట్లుగా అనిపిస్తుంది. ఇక చివరిల్లో జైలర్ 3 పై హింట్ ఇచ్చే సీన్ మాములుగానే ఉంటుంది. అయితే ఈ కథ, పాత్రలతో కనెక్ట్ కావాలంటే ముందుగా జైలర్ సినిమా చూడాల్సిందే. లేదంటే కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. ప్రధాన పాత్రల వెనుక ఉన్న నేపథ్యం అర్థం కాదు. జైలర్ చూసి ఈ సినిమాకు వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు. ఫస్టాఫ్ మాదిరే సెకండాఫ్ కూడా ఉండి ఉంటే.. ఈ సినిమా ఫలితం మరో రేంజ్లో ఉండేది.

ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాలో రజనీకాంత్ కాంత్ చాలా సింపుల్‌గా, స్టైలీష్‌గా కనిపించాడు. వయసు దగ్గట్టుగా ఆయన పాత్రను మలిచారు. దానికి రజనీకాంత్ న్యాయం చేశాడు. ఇక ప్రధాన విలన్‌గా ఎస్.జే సూర్య తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అతని ఎంట్రీ అదిరిపోతుంది. అయితే కొన్ని చోట్ల రొటీన్ డైలాగ్స్‌తో విసుగు తెప్పిస్తాడు. విద్యా బాలన్ పాత్ర బాగుంది.ఆమెను రజనీకాంత్ టీజ్ చేసే సీన్ థియేటర్లో ఈళలు వేయిస్తుంది. అయితే ఇందులో ఆమె నిడివి తక్కువే కానీ.. పార్ట్‌లో 3 ఎక్కువగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మిథున్ చక్రవర్తి రొటీన్ పాత్రను చేశాడు.
క్యామియోల్లో హృతిక్‌ని గట్టిగా వాడుకున్నాడు. జాకీష్రాఫ్ , మోహన్ లాల్, శివరాజ్ కుమార్‌లకు కూడా ఒకటి రెండు సీన్లు అంతే. అవి కూడా పెద్దగా ఆకట్టుకోవు. రమ్యకృష్ణకు కూడా బలమైన సీన్లు పడలేదు. యోగిబాబు, మూర్తి పాత్ర చేసిన నటుడు కామెడీ ఈ సినిమాకు ప్లస్ అయింది. విజయ్ సేతుపతి చివరి సీన్లో అలా మెరుస్తాడు అంతే. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.
సాంకేతికంగా సినిమా బాగుంది. అనిరుధ్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో ప్రధానబలం. తనదైన బీజీఎంతో మరోసారి మ్యూజిక్ చేశాడు. సినిమాలో ఉన్న రెండు పాటలు అంతగా ఆకట్టుకోలేవు. యాక్షన్ సీన్లు స్టైలీష్‌గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ షార్ప్‌గానే ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్


