1.115 కేజీల గంజాయి స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

1.115 కేజీల గంజాయి స్వాధీనం

Oct 17 2026 12:28 AM | Updated on Oct 17 2026 12:28 AM

● తల్లీ, ఇద్దరు కుమారులపై కేసు

ఖమ్మంక్రైం: ఖమ్మం వెంకటేశ్వరనగర్‌లోని ఓ ఇంటి నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం త్రీటౌన్‌ ఎస్‌ఐ కొండల్‌రావు ఆధ్వర్యాన శుక్రవారం బానోత్‌ దేవి ఇంట్లో తనిఖీ చేయగా 1.115 కేజీల గంజాయి లభించింది. ఆమె పెద్దకుమారుడు బానోత్‌ సాయిరామ్‌ అలియాస్‌ సంజయ్‌ గంజాయి తీసుకొస్తుండగా, దేవితో పాటు చిన్నకుమారుడు సంతోష్‌ విక్రయిస్తున్నట్లు వెల్లడైందని సీఐ చిట్టిబాబు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

ట్రాఫిక్‌ పోలీసుల తనిఖీలు

● పలువురు వాహనదారులకు జరిమానా

ఖమ్మం క్రైం: ఖమ్మంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులను కట్టడి చేసేందుకు ట్రాఫిక్‌ సీఐ శివప్రసాద్‌ ఆధ్వర్యాన ఎస్‌ఐలు రవి, రాము, సిబ్బంది శుక్రవారం లకారం జంక్షన్‌ వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎక్కువ శబ్దం వచ్చే సైలెన్సర్లు బిగించిన ఐదు ఎన్‌ఫీల్డ్‌ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, నంబర్‌ ప్లేట్‌ లేని 25 వాహనాలను గుర్తించి జరిమానా విధించారు.

‘ఖేలో ఇండియా’

ఇంజనీర్ల పరిశీలన

ఖమ్మం స్పోర్ట్స్‌: ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో భాగంగా ఆర్చరీ పోటీల నిర్వహణను ఖమ్మంకు కేటాయించారు. ఈనేపథ్యాన సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో ఉన్న వసతుల పరిశీలనకు ఇంజనీర్ల బృందం శుక్రవారం వచ్చింది. డిసెంబర్‌లో ఆర్చరీ పోటీలు జరగనున్న నేపథ్యాన క్రీడామైదానం ఆవరణ, ఇక్కడి వసతులను పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ బృందంలో ఖేలో ఇండియా ఇంజనీరింగ్‌ అధికారులు షారు పింజర(ముంబై), ఓంప్రీ(గోవా) ఉండగా, డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, అథ్లెటిక్స్‌ కోచ్‌ ఎం.డీ.గౌస్‌, మేనేజర్‌ ఉదయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

రైతుల పేరిట గోవుల తరలింపు

కారేపల్లి: రైతుల పేరిట గోవులను అక్రమంగా తరలిస్తుండగా యువకులు వాహనాన్ని అడ్డుకున్నారు. ఖమ్మం మీదుగా డీసీఎం వాహనంలో సుమారు 15పశువులను ఇల్లెందు, మహబూబాబాద్‌ వైపు శుక్రవారం తరలిస్తుండగా కారేపల్లి యువకులు వెంబడించారు. అందులోని వ్యక్తులు రైతులమని చెప్పినా సరైన ఆధారాలు లేకపోవడంతో వాహనాన్ని గోశాలకు తరలించారు. ఈ కార్యక్రమంలో జంగా వెంకటేశ్వర్లు, వైభవ్‌ మణియార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement