రేవంత్‌ ఈఎంఐ ముఖ్యమంత్రి | KTR Reaction to CM Revanth Reddy challenge Over Singareni | Sakshi
Sakshi News home page

రేవంత్‌ ఈఎంఐ ముఖ్యమంత్రి

Oct 17 2026 5:50 AM | Updated on Oct 17 2026 5:50 AM

KTR Reaction to CM Revanth Reddy challenge Over Singareni

కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్‌

అధిష్టానానికి ముడుపులు చెల్లించకుంటే పదవి పోతుందనే సింగరేణి ద్వారా స్కామ్‌

కమీషన్లు కొట్టేందుకే ఆస్ట్రేలియా బొగ్గు కొనుగోలుపై ముఖ్యమంత్రి ఆసక్తి

నర్సంపేట నియోజకవర్గ నేతలతో సమావేశంలో కేటీఆర్‌ ధ్వజం

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతపై ఉమ్మడి వరంగల్‌ జిల్లా నేతలతో భేటీ

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక ఈఎంఐ ముఖ్యమంత్రి అని.. కాంగ్రెస్‌ అధిష్టానానికి కిస్తీలు కట్టక­పోతే సీఎం పదవి పోతుందనే భయం ఆయనకు పట్టుకుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె. తారక రామారావు ఎద్దేవా చేశారు. కిస్తీలు చెల్లించేందుకే విదేశీ బొగ్గు కొనుగోలులో వచ్చే కమీషన్ల ద్వారా నిధులు సమకూర్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగిన నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు.

కాంగ్రెస్‌ అధిష్టానానికి చెల్లించాల్సిన ఈఎంఐలు వసూలు చేసేందుకే రాష్ట్రంలో ఏఐసీసీ వ్యవహారాల ఇన్‌చార్జి రికవరీ ఏజెంట్‌లా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. సింగరేణిని అడ్డు­పెట్టుకొని సీఎం, మంత్రులు టెండర్లు, కమీషన్ల లెక్కలు వేసుకుంటున్నారని ఆరోపించారు. సింగరేణిలో కుంభ­కోణాలు, ప్రతిపాదిత విదేశీ బొగ్గు కొనుగోలు వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. సింగరేణిలో సౌర విద్యుత్‌ స్కామ్‌ను కూడా బయట పెడతామన్నారు.

వెయ్యి టీఎంసీలను వదిలేసి ఎల్‌నినో పేరిట చేతులెత్తేశారు
ఎల్‌నినోపై సరైన సమయంలో స్పందించకుండా సుమారు వెయ్యి టీఎంసీల గోదావరి జలాలను సముద్రంలోకి వదిలేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఇప్పుడు ఏమీ చేయలేమంటూ చేతులెత్తేస్తోందని కేటీఆర్‌ మండిపడ్డారు. మేడిగడ్డ బరాజ్‌ వద్ద కన్నెపల్లి నుంచి దిగువకు వృథాగా వెళ్తున్న నీటిని ఎత్తిపోసేందుకు చర్యలు తీసుకోకుండా ఇప్పుడు పంటలు ఎండుతూ సాగునీరు, తాగునీటి కొరత తీవ్రమవుతుండటంతో ఎల్‌నినో పేరిట సీఎం బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. నర్సంపేట నియోజకవర్గాన్ని అధికారంలోకి వచ్చాక దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు.

కాంగ్రెస్‌కు విద్యావంతులు బుద్ధి చెప్పడం ఖాయం
రాష్ట్రంలోని గ్రాడ్యుయేట్లు, విద్యావంతులు, నిరుద్యోగులు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని.. రానున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయమని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతపై శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నాయకులతో కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఓటరు నమోదు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు బాధ్యతగా తీసుకోవాలని కేటీఆర్‌ సూచించారు.

సహకార సంఘాలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలి
రాష్ట్రంలోని సహకార సంఘాలు, సహకార బ్యాంకులకు వెంటనే ఎన్నికలు నిర్వహించేలా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కేటీఆర్‌ను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా­ల అధ్యక్షులు కోరారు. అన్ని జిల్లాల నుంచి వచ్చిన అధ్యక్షులు శుక్రవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసి సహకార రంగం ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. మేనేజ్‌మెంట్‌ కమిటీలు లేకపోవడంతో సహకార బ్యాంకులు రైతులకు పంట రుణాలు అందించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటు­న్నా­యని అధ్యక్షులు తెలిపారు. 

సీఈఓలకు పరిమిత అధికా­రాలే ఉండటంతో రూ.10 లక్షలకు మించిన రుణాల మంజూ­రు­లో సమస్యలు తలెత్తుతున్నాయని, జిల్లా సహకార బ్యాంకు­ల కార్యకలాపాలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణా­ల పంపిణీ ప్రభావితమవుతోందని వివరించారు. ఐఐటీలు, ఐఐఎంలలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు సైతం విద్యా రుణాలు అందడం లేదన్నారు. పాలకవర్గాల పునరుద్ధరణ అంశం హైకోర్టులో పెండింగ్‌లో ఉందని, న్యాయ ప్రక్రియలో జాప్యం నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే ఎన్నికలు నిర్వహించేలా ఒత్తిడి తేవాలని కేటీఆర్‌ను కోరారు. వారి విజ్ఞప్తిపై స్పందించిన కేటీఆర్‌.. ఎన్నికల నిర్వహణ కోసం తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement