కాక పుట్టిస్తున్న కరెంటు! | Telangana recorded an all-time high power demand of 20000 MW | Sakshi
Sakshi News home page

కాక పుట్టిస్తున్న కరెంటు!

Oct 17 2026 4:36 AM | Updated on Oct 17 2026 4:36 AM

Telangana recorded an all-time high power demand of 20000 MW

20 వేల మెగావాట్లకు చేరిన విద్యుత్‌.. రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధికం

పరిస్థితిని విజయవంతంగా అధిగమించామంటున్న అధికారులు

హైడల్‌ పడక.. సామర్థ్యం మేరకు జరగని థర్మల్‌ ఉత్పత్తి!

తదుపరి 15 రోజుల్లో డిమాండ్‌ వెయ్యి మెగావాట్లు పెరిగే చాన్స్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వినియోగం గరిష్ట స్థాయికి చేరింది. గురు, శుక్రవారాల్లో ఏకంగా 20 వేల మెగావాట్లకు పైనే నమోదైంది. రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధికం. కాగా గత ఏడాది ఇదే సమయంలో అంటే 2025 అక్టోబర్‌లో 12,998 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ మాత్రమే నమోదు కావడం గమ నార్హం. ప్రస్తుతం రోజుకు 334 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఖర్చవుతోంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కరెంటు వినియోగం అంతకంతకూ ఎక్కువవుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ నెల మొదటి వారంలో 18,936 మెగావాట్ల డిమాండ్‌ ఉండగా.. 15 రోజుల్లోనే ఇది 1,067 మెగావాట్లు పెరిగి, 20,003 మెగావాట్లకు చేరింది.

 ప్రధానంగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ, తిరిగి సాయంత్రం 5 నుంచి రాత్రి 11 గంటల వరకూ విద్యుత్‌ డిమాండ్‌ గరిష్ట స్థాయిలో ఉంటోంది. ఈ సమయంలో విద్యుత్‌ గ్రిడ్‌ వణికి పోతోంది. ట్రాన్స్‌ఫార్మర్లు హీటెక్కు తున్నాయి. కండెన్సర్లలో కూడా వేడి పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో కొన్నిచోట్ల 70 కిలోమీటర్ల వరకూ సబ్‌ స్టేషన్లు లేవు. ఇలాంటి చోట్ల లైన్ల మధ్య నిడివి ఎక్కువై ఇబ్బంది ఎదురవుతోంది.

 అర్ధాంతరంగా విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు వాటిల్లు తున్నాయి. అయితే గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ను విజయవంతంగా అధిగమించామని ఒకవైపు అధికారులు చెబుతుంటే..మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అనధికార విద్యుత్‌ కోతలు అమల వుతున్నాయి. జిల్లాల్లో సబ్‌ స్టేషన్ల వద్ద జరుగు తున్న ఆందోళనలు ఈ విషయం స్పష్టం చేస్తు న్నాయి. బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ కొను గోలు చేస్తున్నా, రాష్ట్రంలో ఉత్పత్తి పడిపోతుండటంతో అనధికార కోతలు అనివార్యమవుతు న్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

పడిపోతున్న ఉత్పత్తి: ఒక వైపు విద్యుత్‌ 
డిమాండ్‌ రికార్డులు సృష్టిస్తూ కాక పుట్టిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తి పడిపోతోంది. నీళ్ళు లేక జల విద్యుత్‌ పూర్తిగా పడకేసింది. బొగ్గు కొరతతోనే థర్మల్‌ కేంద్రాల్లో ఉత్పత్తి అంతంత మాత్రంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. సామర్ధ్యం మేరకు ఉత్పత్తి లేకపోవడంతో అత్యధిక ధరలకు మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం రోజూ 334 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ కావాలి. జెన్‌కో స్టేషన్ల నుంచి అతి కష్టంగా 40 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అందుతోందని సమాచారం. 

ఇతర పీపీఏలు, కేంద్రం సంస్థల విద్యుత్‌ పోను 130 మిలియన్‌ యూనిట్లపైనే కొనుగోలు చేస్తున్నారు. కొన్ని సమయాల్లో యూనిట్‌ రూ.10పైనే ఉంటోంది. వాస్తవానికి 80 మిలియన్‌ యూనిట్ల వరకూ థర్మల్‌ స్టేషన్లు ఉత్పత్తి చేసే వీలుందని చెబుతున్నారు. అయితే ఇందుకు రోజుకు 75 వేల టన్నుల బొగ్గు అవసరం. ఒక్క 4 వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌కే రోజూ 35 వేల టన్నుల బొగ్గు అవసరం. కాగా జెన్‌కో ముందే చెప్పినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే బొగ్గుకు కొరత ఏర్పడిందని సంస్థ వర్గాలు అంటున్నాయి.

వాతావరణం ఇలాగే కొనసాగితే..
    వాతావరణం ఇలాగే ఉంటే, తదుపరి 15 రోజుల్లో ఇంకో వెయ్యి మెగావాట్ల డిమాండ్‌ పెరిగే అవకాశం ఉందని తెలంగాణ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ అంచనా వేస్తుండగా, బహిరంగ మార్కెట్లో ఈ మేరకు అదనంగా విద్యుత్‌ లభించడం కష్టమేనని అధికారులు చెబుతున్నారు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఇప్పటికే బిడ్డింగ్‌లో ముందున్నాయని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో సాయంత్రం వరకూ సోలార్‌పై ఆధారపడ్డా, రాత్రి సమయంలో విద్యుత్‌ సరఫరాకు ఇబ్బంది కలగవచ్చని అంచనా వేస్తున్నారు. కనీసం 50 మిలియన్‌ యూనిట్లు అదనంగా లభిస్తే తప్ప ఇప్పుడున్న కోతలతో విద్యుత్‌ సరఫరా చేసేందుకు వీలవుతుందని అధికారులు చెబుతున్నారు.

ఉత్పత్తి పెరగక, విద్యుత్‌ లభించని పక్షంలో, డిమాండ్‌ మరింత పెరిగితే కోతలు కూడా మరింత పెరిగే వీలుందని అంటున్నారు. ముఖ్యంగా పంటలు చేతికొచ్చే సమయంలో వ్యవసాయ విద్యుత్‌ సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో కరెంటు రాజకీయంగానూ వేడి రాజేస్తోంది. బొగ్గు కొరత వివాదం, ప్రభుత్వ నిర్లక్ష్యమంటూ విపక్షాల విమర్శలు, అనధికార కోతలు వెరసి కరెంటు కాక పెంచుతోంది.

అక్టోబర్‌ నెలలో విద్యుత్‌ డిమాండ్, వినియోగం
తేదీ        గరిష్ట  డిమాండ్‌    వినియోగం
            (మెగావాట్లల్లో)    (మిలియన్‌ యూనిట్లు)
01–10–2026        18,936        320.90
02–10–2026        18,368        313.41
03–10–2026        19,098        317.17
04–10–2026        18,447        314.22
05–10–2026        18,982        314.20
06–10–2026        19,204        315.51
07–10–2026        19,535        318.69
08–10–2026        19,598        320.90
09–10–2026        19,762        324.54
10–10–2026        19,462        322.07
11–10–2026        19,087        327.38
12–10–2026        19,764        327.40
13–10–2026        19,457        323.91
14–10–2026        19,636        325.27
15–10–2026        20,003        334.54 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement