భవిష్యత్తు పోలీసింగ్‌లో ఏఐ కీలకం! | NPA Director Sujit Pandey Exclusive Interview With Sakshi | Sakshi
Sakshi News home page

భవిష్యత్తు పోలీసింగ్‌లో ఏఐ కీలకం!

Oct 17 2026 5:29 AM | Updated on Oct 17 2026 5:29 AM

NPA Director Sujit Pandey Exclusive Interview With Sakshi

సాంప్రదాయ పోలీసింగ్‌తో పాటు ఏఐను ఆధారంగా చేసుకోక తప్పని పరిస్థితి రావొచ్చు

ఐపీఎస్‌ల శిక్షణలో కీలక మార్పులు

యువ అధికారుల్లో నైతిక విలువలు పెంచేలా ప్రత్యేక దృష్టి

కొత్త సవాళ్లను దీటుగా ఎదుర్కొనేలా శిక్షణ

కేడెట్ల శక్తియుక్తులకు మూడు దశల్లో పరీక్ష

‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఎన్‌పీఏ డైరెక్టర్‌ సుజిత్‌ పాండే

సాక్షి, హైదరాబాద్‌: సాంకేతికత అన్ని రంగాల్లో విస్తృతమవుతున్న నేపథ్యంలో భవిష్యత్తు పోలీసింగ్‌లోనూ ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) పాత్ర అత్యంత కీలకం కాబోతోందని జాతీయ పోలీస్‌ అకాడమీ (ఎన్‌పీఏ) డైరెక్టర్‌ సుజిత్‌ పాండే అన్నారు. సాంప్రదాయ పోలీసింగ్‌ కొనసాగడంతో పాటు పోలీస్‌ విధుల్లో ఏఐను ఆధారంగా చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చని చెప్పారు. యువ ఐపీఎస్‌ అధికారుల్లో నైతిక విలువలు, నిజాయితీని పెంచడంతో పాటు సాంకేతిక అంశాల్లో వారిని నిపుణులుగా మార్చేలా ఈసారి ఐపీఎస్‌ల శిక్షణలో కీలక మార్పులు చేసినట్టు తెలిపారు.

ఇండక్షన్‌ ట్రైనింగ్‌ పూర్తి చేసుకున్న 78వ రెగ్యులర్‌ రిక్రూట్స్‌ (ఆర్‌ఆర్‌) బ్యాచ్‌కు చెందిన ట్రైనీ ఐపీఎస్‌ అధికారులు శనివారం రాజేంద్రనగర్‌లోని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీ (ఎన్‌పీఏ)లో నిర్వహించనున్న దీక్షాంత్‌ (పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌)లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా     ఎన్‌పీఏలో ఐపీఎస్‌ల శిక్షణ తదితర అంశాలపై జాతీయ పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌ సుజిత్‌ పాండే ‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వూలో పలు విషయాలు వెల్లడించారు. 

ఇంటిగ్రిటీ అత్యంత ముఖ్య అంశం 
    ఎన్‌పీఏ శిక్షణలో ఇంటిగ్రిటీ అత్యంత ముఖ్య అంశంగా ప్రతి ట్రైనీకి చెబుతాం. ఆ దిశగానే వారి శిక్షణలో నైతిక విలువలు, నిజాయితీ, నిబద్ధత పెరిగేలా కీలక అంశాలు ఉంటాయి. ఒకసారి క్షేత్రస్థాయి విధుల్లోకి వెళ్లిన తర్వాత..ఎన్‌పీఏలో తీసుకున్న ప్రతిజ్ఞకు కట్టుబడి, చట్టాలు, రాజ్యాంగానికి లోబడి విధులు నిర్వహించాలని చెబుతున్నాం.  

ఒత్తిడిని తట్టుకునేందుకు ప్రత్యేక శిక్షణ 
    ఒత్తిడిని తట్టుకుని సరైన నిర్ణయాలు తీసుకునేలా ప్రత్యేక శిక్షణ ఇస్తాం. శిక్షణలో భాగంగా ప్రతి ట్రైనీకి మేం మానసికంగా, శారీరకంగా తీవ్ర ఒత్తిడితో కూడిన పరిస్థితులను కల్పిస్తాం. ఆ పరిస్థితుల్లోనూ సరైన నిర్ణయాలు తీసుకోవడం అనేది వాళ్లు ఇక్కడే నేర్చుకుంటారు. కాబట్టి క్షేత్రస్థాయిలో ఎలాంటి ఒత్తిడినైనా ఎదుర్కొనేలా ఉత్తమంగా పనిచేస్తారు. నూతన సవాళ్లను ఎదుర్కొనేలా వారు అకాడమీలోనే తరీ్ఫదు పొందుతారు.  

భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేలా.. 
    సంప్రదాయ పోలీసింగ్‌ను కొనసాగిస్తూనే మారుతున్న శాంతిభద్రతల సమస్యలు, దేశ అంతర్గత భద్రతకు విఘాతం కల్గించే బయటి శక్తులను ఎదుర్కోవడం, సైబర్‌ నేరాలు సహా భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేలా వారిని తీర్చిదిద్దాం. ఇన్‌స్ట్రక్టర్లకు ఇండోర్, ఔట్‌డోర్‌లో కరికులంపై ఇన్‌స్ట్రక్టర్స్‌ సర్టిఫికేషన్‌ కోర్సును ఈ బ్యాచ్‌ నుంచి ప్రారంభించాం. ఇన్‌స్ట్రక్టర్లు బాగా ఉంటేనే వారు మంచి శిక్షణ ఇవ్వగల్గుతారన్నది దీని ఉద్దేశం. ఫిజికల్‌ ఫిట్నెస్‌ విషయంలో ట్రైనీ ఐపీఎస్‌ల సమర్థత.. శిక్షణకు ముందు, శిక్షణ తర్వాత ఎలా మారిందన్నది పరీక్షించేలా, పీబీఏ (ప్రోగ్రెసిస్‌ స్కిల్‌ బెంచ్‌మార్క్‌ అసెస్‌మెంట్‌) , క్యూబీఏ (క్వాలిఫైయింగ్‌ బెంచ్‌మార్క్‌ అసెస్‌మెంట్‌) విధానాలతో అంచనా వేస్తూ శిక్షణను మెరుగు పరిచాం. ఫైర్‌ సేఫ్టీ, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అంశాన్ని ఈ సారి శిక్షణలో ప్రత్యేకంగా చేర్చాం. మూడు నూతన నేర చట్టాలపై పట్టు సాధించేలా శిక్షణ ఇచ్చాం.  

ప్రవర్తనపై మదింపు  
    ఒక్కొక్కరు ఒక్కో నేపథ్యంతో అకాడమీలో అడుగు పెడతారు. మేం ఈసారి ఈ బ్యాచ్‌లోని 151 మంది ట్రైనీలకు డిఫెన్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైకలాజికల్‌ రీసర్చ్‌ (డీఐపీఆర్‌) సాయంతో ఎథికల్‌ వాల్యూస్, పర్సనాలిటీ, ఒత్తిడి విషయంలో వాళ్లు ఎలా ప్రవర్తిస్తున్నారు..ఇలా 11 అంశాలను అకాడమీలో చేరిన మొదట్లో ఒకసారి, ట్రైనింగ్‌ మధ్యలో ఒకసారి, మొదటి దశ శిక్షణ పూర్తి చేసుకున్న సమయంలో ఇలా మూడుసార్లు ఎసెస్‌ చేశాం. దీనివల్ల వారి శిక్షణలో ఎలాంటి మార్పులు చేయాలన్నది గుర్తించే వీలు కల్గింది. 

వివిధ అంశాలపై ప్రత్యేక శిక్షణ 
    సైబర్‌ నేరాలు, డార్క్‌ నెట్, బ్లాక్‌ చైన్, క్రిప్టో కరెన్సీ సహా సైబర్‌నేరాలు అనేవి భవిష్యత్తు సవాలుగా మారిన సమయంలో యువ ఐపీఎస్‌ అధికారులు సైతం భవిష్యత్తులో సైబర్‌ నేరాలను ఎదుర్కొనేలా, వాటిని అరికట్టేలా, వారిని సాంకేతిక పోలీసింగ్, సాంకేతిక అంశాల దర్యాప్తులో నిపుణులుగా మార్చేలా ఈసారి శిక్షణలో కీలక మార్పులు చేశాం. ఏఐ, మిషన్‌ లెరి్నంగ్, బిగ్‌ డేటా ఎనాలసిస్, సైబర్‌ సెక్యూరిటీ అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చాం.  

సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా ఎన్‌పీఏ 
    నూతన నేర చట్టాలపై పూర్తి అవగాహన పెంచేలా భవిష్యత్తులో ఎన్‌పీఏను నూతన నేర చట్టాలకు సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌గా మార్చబోతున్నాం. ఇక్కడ ఒక క్రైం సీన్‌ కేసులో దర్యాప్తు ప్రారంభించినప్పటి నుంచి చివరకు ఆ కేసులో ట్రయల్‌ పూర్తయ్యే వరకు ఇలా ప్రతి దశలో ఏం చేయాలన్నది నేర్పుతాం. అదేవిధంగా బాంబులు, ఐఈడీలను ఎదుర్కొనేలా ప్రత్యేక శిక్షణ ఇచ్చేలా, భవిష్యత్తులో వచ్చే సవాళ్లను ఎదుర్కొనే పూర్తి వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నాం. ప్రభుత్వం ఇప్పటికే ఇబ్రహీంపట్నంలో ఇందుకోసం స్థలం కూడా కేటాయించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement