కొలువుల జాతర

TSPSC Released Notification For 2786 Posts In Various Departments - Sakshi

2,786 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ 

నెలాఖరులోగా మరో 3 నోటిఫికేషన్లు: ఘంటా

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో కొలువుల జాతర మొదలైంది. రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలోని 2,786 పోస్టుల భర్తీకి శనివారం నోటిఫికేషన్లు విడుదల చేసింది. అందులో 700 గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) పోస్టులు, 474 మండల ప్లానింగ్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌/అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ పోస్టులు, 1,521 గ్రూప్‌–4 పోస్టులు ఉన్నాయి. ఇక ఆర్టీసీలో గ్రూప్‌–4 కేటగిరీ కిందికి వచ్చే పోస్టులు 72, రెవెన్యూ శాఖలో సీనియర్‌ స్టెనో కేటగిరీలో 19 పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు నోటిఫికేషన్లను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. 

అర్హతలు, దరఖాస్తులు, వివరాలివీ..

  • గ్రూప్‌–4 పోస్టులకు ఈ నెల 7వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబర్‌ 10న రాతపరీక్ష నిర్వహిస్తారు. డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్వహించిన తెలుగు/ఇంగ్లిషు లోయర్‌గ్రేడ్‌ టైప్‌ రైటింగ్‌లో పాసై ఉండాలి. ఫైనాన్స్‌ పోస్టులకు కామర్స్‌ సబ్జెక్టుతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 
  • ఆర్టీసీలో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఈ నెల 7వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబర్‌ 7న రాతపరీక్ష నిర్వహిస్తారు. 
  • మండల ప్లానింగ్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌/అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు ఈ నెల 8వ తేదీ నుంచి జూలై 2వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. సెప్టెంబర్‌ 16న రాతపరీక్ష ఉంటుంది. ఈ పోస్టుల కోసం స్టాటిస్టిక్స్‌ను డిగ్రీలో ప్రధాన సబ్జెక్టుగా చదివి ఉండాలి. డిగ్రీ ప్రథమ సంవత్సరంలో మ్యాథ్స్, రెండు, మూడో సంవత్సరంలో స్టాటిస్టిక్స్‌ మెయిన్‌ సబ్జెక్టుగా చదవాలి. లేదా డిగ్రీ ఎకనామిక్స్, కామర్స్, కంప్యూటర్‌ సైన్స్‌లో స్టాటిస్టిక్స్‌ మెయిన్‌ సబ్జెక్టుగా ఉండాలి. 
  • వీఆర్వో పోస్టులకు ఈ నెల 8 నుంచి జూలై 2వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. సెప్టెంబర్‌ 16న రాతపరీక్ష ఉంటుంది. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులై ఉండాలి. 
  • జూనియర్‌ స్టెనో పోస్టులకు డిగ్రీలో ఉత్తీర్ణులై.. ప్రభుత్వ సాంకేతిక విభాగం నిర్వహించిన పరీక్షల్లో హయ్యర్‌ గ్రేడ్‌ టైప్‌ రైటింగ్, హయ్యర్‌ గ్రేడ్‌ షార్ట్‌హ్యాండ్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. 
  • సీనియర్‌ స్టెనో పోస్టులకు ఈ నెల 11వ తేదీ నుంచి జూలై 2వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. రాతపరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తారు. ఈ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ప్రభుత్వ టెక్నికల్‌ విభాగం నిర్వహించే హయ్యర్‌ గ్రేడ్‌ టైప్‌ రైటింగ్‌లో పాసై ఉండాలి. 
  • టైపిస్టు ఉద్యోగానికి డిగ్రీలో ఉత్తీర్ణతతోపాటు తెలుగు టైప్‌ రైటింగ్‌లో హయ్యర్‌ గ్రేడ్‌ పాసై ఉండాలి. 

మరో 20 వేల పోస్టుల భర్తీపై కసరత్తు: చక్రపాణి 
సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ద్వారా మూడేళ్లలో 12 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, మరికొన్ని పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని.. నెలాఖరులోగా మరో మూడు నోటిఫికేషన్లు జారీ చేస్తామని చైర్మన్‌ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. రాష్ట్రావతరణ వేడుకలను పురస్కరించుకుని శనివారం ఆయన టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి 20 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై కసరత్తు చేస్తున్నామని, త్వరలో 8 వేల పోస్టులకు సంబంధించి ఫలితాలను ప్రకటిస్తామని చక్రపాణి తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల కలను సాకారం చేసేందుకు టీఎస్‌పీఎస్సీ సిబ్బంది నిద్రాహారాలు మాని పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి టీఆర్టీ ఫలితాలను వారంలోపు ప్రకటిస్తామని, అదే విధంగా జిల్లాల వారీగా మెరిట్‌ జాబితా కూడా విడుదల చేస్తామని చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top